బెర్ముడా ట్రయాంగిల్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. నౌకలు, విమానాలు అదృశ్యమవుతాయనే ఎన్నో హారర్ స్టోరీస్ కూడా దీని చుట్టూ ఉన్నాయి. ఈ బెర్ముడా గురించి కథలుకథలుగా చెప్పుకుంటాం. ఇది చాలా కాలంగా రహస్య ప్రాంతంగానే ఉండేది. అయితే అమెరికన్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఈ ప్రాంతానికి సంబంధించిన భౌగోళిక రహస్యంపై ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
బెర్ముడా ఐలాండ్ సాధారణ అగ్నిపర్వత ద్వీపాల మాదిరిగా ఏర్పడలేదని పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా అగ్నిపర్వత ద్వీపాలు భూమి అంతర్భాగం నుంచి పైకి వచ్చే వేడి శిలా ప్రవాహాల (mantle plumes)తో ఏర్పడతాయి. కాలక్రమేణా ఆ ప్రక్రియ ఆగిపోతే ద్వీపాలు క్రమంగా దిగజారుతాయి. కానీ బెర్ముడా విషయంలో అలా జరగలేదు.
భూకంపాలతో ఉత్పత్తి అయ్యే సీస్మిక్ తరంగాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ద్వీపానికి సుమారు 20 మైళ్ల లోతులో ఒక అసాధారణ శిలా పొరను గుర్తించారు. ఈ పొర సుమారు 12 మైళ్లకుపైగా మందంగా ఉండి, చుట్టుపక్కల ఉన్న మాంటిల్ శిలల కంటే తేలికగా, ఎక్కువ తేలే స్వభావం ఉంది.
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, బెర్ముడాను ప్రస్తుతం పైకి నిలబెడుతున్నది క్రియాశీల మాంటిల్ ప్లూమ్ కాదు. సముద్రపు భూకవచం కింద ఏర్పడిన ఈ తేలికపాటి “అండర్‌ప్లేటింగ్” (underplating) అనే రాతి పోరా . ఇది లక్షల సంవత్సరాల క్రితం వేడి ద్రవరూప శిలలు భూకవచం కింద ప్రవహించి చల్లబడటంతో ఏర్పడి ఉండవచ్చని వారు భావిస్తున్నారు.
ఈ పరిశోధన భూమి అంతర్భాగంలో ఇంకా పూర్తిగా అర్థం కాని భౌగోళిక ప్రక్రియలు ఉన్నాయని సూచిస్తోంది. అందువల్ల బెర్ముడా కేవలం రహస్య కథలకే కాదు, భూగర్భ శాస్త్ర పరిశోధనలకు కూడా అత్యంత ఆసక్తికరమైన ప్రాంతంగా నిలుస్తోంది.
