నడక సులువైన వ్యాయామం. వయస్సుతో నిమిత్తం లేదు. అందరూ రోజూ కొంత సమయం నడిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. వైద్యులు కూడా ప్రతిరోజూ నడవాలని సూచిస్తుంటారు. అయితే వాకింగ్‌ను సరైన పద్ధతిలో చేయడం చాలా ప్రధానం . వయస్సు, శారీరక సామర్థ్యం, బరువును బట్టి నడక సమయాన్ని నిర్ణయించుకోవాలి.
ప్రస్తుతం చిన్న వయస్సులోనే గుండె జబ్బులు, రక్తపోటు, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్యలను తగ్గించడంలో నడక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోజుకు కనీసం ఒక కిలోమీటరు నడవడం వల్ల శరీరానికి, మనసుకు ఎంతో మేలు జరుగుతుంది.
- ఇలా నడవాలి..
- 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉన్నవారు రోజుకు 30 నుంచి 60 నిమిషాలు నడవవచ్చు.
- అధిక బరువు ఉన్నవారు మొదట 10 నిమిషాలతో ప్రారంభించి క్రమంగా సమయాన్ని పెంచుకోవాలి.
- 31 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు రోజుకు 30 నుంచి 45 నిమిషాలు నడవడం మంచిది.
- 66 నుంచి 75 సంవత్సరాల వయస్సు ఉన్నవారు రోజుకు 20 నిమిషాలు నడిస్తే సరిపోతుంది.
నడకతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. నడిచేటప్పుడు శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్ హార్మోన్లు ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.
నడక జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. నిద్ర బాగా పట్టేందుకు కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా నడిస్తే బరువు నియంత్రణలో ఉండటమే కాకుండా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది.అందువల్ల ప్రతి ఒక్కరూ వారి వారి వయస్సు, ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా రోజూ నడకను అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవితానికి నడక సులభమైన, సమర్థవంతమైన మార్గం.
గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ లోని అంశాలు పాఠకుల సమాచారం కోసం అదేవిధంగా అవగాహన ఇచ్చినవి మాత్రమే. వివిధ వెబ్‌సైట్స్ లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇచ్చిన అంశాలను ఫాలో అయ్యేముందు మీ ఆరోగ్య సలహాదారుల సూచనలు తీసుకోవలసిందిగా సూచిస్తున్నాం.
