ఆరు రోజుల్లో రూ.332 కోట్ల మార్క్ దాటిన రామ్ చరణ్ మూవీ
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో క్రీడల కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విడుదలైన తొలి వారంలోనే భారీ వసూళ్లు సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ వచ్చినా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల మార్కెట్లలోనూ మంచి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాకు విశేష ఆదరణ కనిపిస్తోంది.
తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, విడుదలైన ఆరు రోజుల్లోనే ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా రూ.332.1 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఆరో రోజు మాత్రమే రూ.17 కోట్లకు పైగా రాబట్టినట్లు సమాచారం. దీంతో సినిమా రూ.350 కోట్ల క్లబ్ వైపు వేగంగా దూసుకెళ్తోందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
హిందీ వెర్షన్ కూడా ఆశాజనక వసూళ్లను నమోదు చేస్తోంది. మరోవైపు ఉత్తర అమెరికా మార్కెట్లో ఈ చిత్రం ఇప్పటికే 3 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పెద్ద సినిమాల విడుదల లేకపోవడం కూడా ‘పెద్ది’కి అదనపు బలంగా మారింది.
దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్గా జాన్వీకపూర్ నటించింది. కీలక పాత్రల్లో శివరాజ్ కుమార్, జగపతిబాబు , తదితరులు నటించారు. సంగీత బాధ్యతలను ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ నిర్వహించారు.
గ్రామీణ క్రీడల నేపథ్యం, భావోద్వేగాలు, భారీ నిర్మాణ విలువలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ‘పెద్ది’ విజయపథంలో దూసుకుపోతోంది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
