ప్రకృతి కోసం 84 ఏళ్ల మహిళ అసాధారణ జీవితం
ప్రపంచం వేగంగా నగరీకరణ, వాణిజ్యీకరణ దిశగా పరుగులు తీస్తున్న ఈ కాలంలో ప్రకృతిని కాపాడటానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఓ మహిళ కథ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. అమెరికాలోని జార్జియా తీరంలో ఉన్న కంబర్లాండ్ ద్వీపంలో గత 53 ఏళ్లుగా ఒంటరిగా నివసిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతర పోరాటం చేస్తున్న 84 ఏళ్ల పర్యావరణ శాస్త్రవేత్త కారల్ రుక్డెషెల్ జీవితం అరుదైన ఉదాహరణగా నిలిచింది.
బాహ్య ప్రపంచపు హడావుడికి, ఆధునిక సౌకర్యాలకు దూరంగా దాదాపు 36 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ద్వీపంలో చిన్న చెక్క ఇంటిని నిర్మించుకుని పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి జీవిస్తున్న ఆమెను చాలామంది “అమెరికాస్ వైల్డెస్ట్ ఉమెన్” అని పిలుస్తారు. సముద్ర తాబేళ్లపై చేసిన విశేష పరిశోధనల కారణంగా “సీ టర్టిల్స్ జేన్ గుడాల్” అనే గుర్తింపును కూడా సంపాదించుకున్నారు.
కరోల్ రక్‌డెషెల్ జీవితంలో అత్యంత విశిష్టమైన అధ్యాయం సముద్ర తాబేళ్ల సంరక్షణ. ఇప్పటివరకు 4 వేలకుపైగా లాగర్‌హెడ్ తాబేళ్ల మృతదేహాలను పరిశీలించి వాటి మరణాలకు గల కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. చేపల వేటలో ఉపయోగించే వలల్లో చిక్కుకుని పెద్ద సంఖ్యలో తాబేళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆమె పరిశోధనలు నిరూపించాయి. ఈ ఆధారాలే అమెరికా ప్రభుత్వం చేపల వేట వలల రూపకల్పనలో మార్పులు చేయడానికి దారి తీశాయి. పర్యావరణ పరిరక్షణలో శాస్త్రీయ పరిశోధన ఎంత ప్రభావవంతంగా ఉండగలదో ఆమె నిరూపించారు.
ఆమె సేకరించిన తాబేళ్ల అస్థిపంజరాల సేకరణ అంత ప్రాముఖ్యతను సంతరించుకుంది కాబట్టి, అమెరికాలోని ప్రముఖ స్మిత్సోనియాన్ ఇన్స్టిట్యూషన్ శాస్త్రవేత్తలు సైతం ఆమెను కలిసేందుకు వందల మైళ్ల దూరం ప్రయాణించి ద్వీపానికి చేరుకున్నారు.
అయితే కరోల్ పోరాటం కేవలం తాబేళ్ల సంరక్షణతో ముగియలేదు. కంబర్లాండ్ ద్వీపాన్ని వాణిజ్యీకరణ నుంచి రక్షించడమే ఇప్పుడు ఆమె ప్రధాన లక్ష్యంగా మారింది. ప్రకృతి సమతుల్యతను కాపాడాలంటే భారీ పర్యాటక రద్దీని నియంత్రించాలని ఆమె వాదిస్తోంది. ఆమె దీర్ఘకాల పోరాటం ఫలితంగానే ప్రస్తుతం రోజుకు కేవలం 300 మంది సందర్శకులకు మాత్రమే అనుమతి ఉంది. ఈ సంఖ్యను పెంచాలన్న ప్రభుత్వ సంస్థల ప్రయత్నాలకు ఆమె ఇప్పటికీ గట్టిగా వ్యతిరేకంగా నిలుస్తున్నారు.
ద్వీపంలోని సహజ సౌందర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ధనిక వర్గాలు, కార్పొరేట్ సంస్థలు అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నా, కోర్టుల ద్వారా వాటిని అడ్డుకునేందుకు ఆమె నిరంతరం పోరాడుతున్నారు. గతంలో ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల మద్దతు కూడగట్టిన ఆమె ప్రస్తుతం వైల్డ్ కమ్బర్లాండ్ ద్వారా యువ శాస్త్రవేత్తలను, పర్యావరణ కార్యకర్తలను ఏకం చేస్తున్నారు.
84 ఏళ్ల వయసులోనూ ప్రకృతి పరిరక్షణ కోసం ఆమె చేస్తున్న అంకితభావం ప్రపంచ పర్యావరణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్న ఆధునిక సమాజానికి కరోల్ రక్‌డెషెల్ జీవితం ఒక ప్రశ్నలా, అదే సమయంలో ఒక మార్గదర్శకత్వంలా నిలిచింది. ప్రకృతిని కాపాడాలనే సంకల్పం ఉంటే ఒక వ్యక్తి కూడా ఎంతటి మార్పునైనా తీసుకురాగలడని ఆమె జీవితం చాటిచెబుతోంది.
