విజయవాడ: రాష్ట్రంలోని కాపు, బలిజ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చ జరిపి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకు ఆగస్టు 16న విజయవాడలో భారీ కాపు నాయకుల సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు, కాపునాడు జాతీయ గౌరవ అధ్యక్షుడు చందు జనార్ధన్ ప్రకటించారు.
విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విజయవాడ ఐవీ ప్యాలెస్‌లో ఆహ్వానితులతో మాత్రమే ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, కాపు సంఘాల నాయకులను సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
సమావేశంలో కాపులకు బీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్‌లో 5 శాతం రిజర్వేషన్ అమలు, కాపు కార్పొరేషన్‌కు ప్రతి సంవత్సరం రూ.3,000 కోట్ల నిధుల కేటాయింపు, రాష్ట్రవ్యాప్తంగా కాపు కళ్యాణ మండపాల నిర్మాణం చేసి వాటిని కాపు కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావడం వంటి ప్రధాన డిమాండ్లపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు.
టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, కన్నా లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నుంచి పల్లంరాజు, ఉషా నాయుడు, ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, కన్నబాబు, మహాలక్ష్మి శ్రీనివాస్, జనసేన నుంచి సామినేని ఉదయభాను, బొలిశెట్టి శ్రీనివాస్ తదితర ప్రముఖులను సమావేశానికి ఆహ్వానించినట్లు చందు జనార్ధన్ తెలిపారు.
సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకత్వం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి వినతిపత్రాల రూపంలో అందజేస్తామని, అనంతరం నిర్ణయించిన కార్యాచరణ ప్రకారం ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
కాపునాడు జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర కాపు జేఏసీ గౌరవ చైర్మన్ గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు అర్జా రామకృష్ణ,కాపునాడు జేఏసీ నాయకులు ఆకుల శ్రీనివాసరావు, నవనీతం సాంబశివరావు, ఆకుల తిరుమలరావు, బైపూడి నాగేశ్వరరావు, రాంబాబు, బశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
