వెనెజువెలాను వణికించిన జంట భూకంపాలు

Venujula

వెనెజువెలాను కుదిపేసిన వరుస భూకంపాల విధ్వంసం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. జూన్ 24న సెకన్ల వ్యవధిలో సంభవించిన 7.2, 7.5 తీవ్రత గల రెండు శక్తివంతమైన భూకంపాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. తాజా సమాచారం ప్రకారం ఈ జంట భూకంపాల్లో మరణించిన వారి సంఖ్య 920కు చేరింది. మరో 3 వేల మందికిపైగా గాయపడగా, 50 వేల మందికిపైగా ప్రజల ఆచూకీ ఇంకా తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద ఇంకా వందలాది మంది చిక్కుకుని ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

రాజధాని కారకస్తో పాటు లా గువేరా, యరాకుయ్, కారబోబో ప్రాంతాల్లో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. వందలాది భవనాలు నేలమట్టమవగా, రహదారులు, వంతెనలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, సమాచార వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తూ ప్రాణాలతో ఉన్నవారి కోసం నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

అమెరికా భూగర్భ సర్వే (USGS) అంచనా ప్రకారం, గత 125 ఏళ్లలో వెనెజువెలాలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఇవి ఒకటిగా నిలిచాయి. ఈ విపత్తు నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

విపత్తుతో అతలాకుతలమైన వెనెజువెలాకు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. పలు దేశాలు సహాయక బృందాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సహాయ సామగ్రిని పంపిస్తున్నాయి. భారత్ కూడా ‘ఆపరేషన్ అమిస్తాద్’ పేరుతో సహాయక చర్యలు ప్రారంభించింది. రెండు భారత వైమానిక దళం C-17 విమానాల ద్వారా 41 మంది ప్రత్యేక వైద్య బృందం, ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, 35 టన్నులకుపైగా ఔషధాలు, వైద్య పరికరాలు, సహాయ సామగ్రిని వెనెజువెలాకు పంపించింది.