ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు సెమీస్ చేరే ఆశలు సజీవంగానే ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా నుంచి ఎదురైన పరాభవం నుంచి కోలుకుని, వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో గురువారం రాత్రి జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఇండియా ఐదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్, నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత్ తరఫున రాధా యాదవ్ మూడు వికెట్లు తీయగా, శ్రీ చరణీ రెండు వికెట్లు పడగొట్టింది.
అనంతరం షఫాలీ వర్మ 34 బంతుల్లో చేసిన 53 పరుగుల అద్భుత ప్రదర్శనతో భారత్ 16.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైంది.
గ్రూప్ ‘ఎ’లో జరిగిన మరో మ్యాచ్‌లో, బ్రిస్టల్‌లో జరిగిన పోరులో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ను 88 పరుగుల తేడాతో ఓడించి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఈ విజయంతో, గ్రూప్ ‘ఎ’లో మూడు విజయాలు, ఒక ఓటమితో ఆరు పాయింట్లతో భారత్, ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా తమ నాలుగు మ్యాచ్‌లలోనూ గెలిచి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలవగా, నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలతో దక్షిణాఫ్రికా సెమీ-ఫైనల్ స్థానానికి బలమైన పోటీదారుగా నిలిచింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ‘విమెన్ ఇన్ బ్లూ’ జట్టు సెమీ-ఫైనల్స్‌లో సునాయాసంగా స్థానం దక్కించుకోవాలంటే, ఆదివారం ఆస్ట్రేలియాను ఓడించాల్సి ఉంటుంది.
