ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల హెచ్చరిక..
ఉత్తరాఖండ్‌లో వాతావరణం మారిపోయింది. భారత వాతావరణ శాఖ రాబోయే 72 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. దీంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమై, చార్‌ధామ్ యాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. ప్రస్తుతం హిమాలయాల్లోని పవిత్ర క్షేత్రాలను దర్శించుకుంటున్న వేలాది మంది భక్తుల భద్రతే ప్రభుత్వ తొలి ప్రాధాన్యంగా మారింది.
కేదార్‌నాథ్, బద్రీనాథ్ ప్రాంతాలకు వెళ్లే పలు మార్గాల్లో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యంగా లంబగఢ్, గులాబ్‌కోటి వంటి కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. రుద్రప్రయాగ్, చమోలి, ఉత్తరకాశీ జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు ప్రయాణం ప్రారంభించే ముందు తాజా వాతావరణ పరిస్థితులు, రోడ్ల స్థితి, ట్రాఫిక్ వివరాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కాన్వాయ్ సమయాలను పరిస్థితులకు అనుగుణంగా మారుస్తున్నారు.
ఇప్పటికే యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు కూడా ప్రభుత్వం ఊరటనిచ్చింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణం వాయిదా పడితే, వారి టోకెన్లు తర్వాతి తేదీల్లో కూడా చెల్లుబాటు అయ్యేలా నిబంధనలను సవరించింది.
జిల్లాల వారీగా హెచ్చరికలు
రుద్రప్రయాగ్ – కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
చమోలి – ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఉత్తరకాశీ – స్థానికంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేసింది.
యాత్రికులకు కీలక సూచనలు కూడా ఇచ్చింది. సూర్యాస్తమయం తర్వాత ట్రెక్కింగ్‌కు వెళ్లకపోవడమే మంచిది . అత్యవసర మందులు, వెచ్చని దుస్తులు, పొడి ఆహారాన్ని వాటర్‌ప్రూఫ్ బ్యాగుల్లో ఉంచుకోవాలి. గంగోత్రి వంటి మారుమూల ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ అందకపోవచ్చు. కాబట్టి అవసరమైన వారికి ముందుగానే సమాచారం ఇవ్వాలి. ఎక్కడైనా రోడ్లు మూసివేస్తే లేదా కొండచరియలు విరిగిపడితే వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెల్ప్ సెంటర్లను సంప్రదించాలి. రోడ్ల పరిస్థితి, మార్గాల క్లియరెన్స్, తాజా అప్‌డేట్స్‌ను ఉత్తరాఖండ్ టూరిజం అధికారిక పోర్టల్‌లో పరిశీలించండి.
భారీ వర్షాల సమయంలో అస్వస్థతగా అనిపిస్తే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లకుండా సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని సూచించింది.
