కొత్త పుస్తకంలో ఎన్‌సీఈఆర్‌టీ చేర్పు
జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) 9వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ఎన్నికల సంఘం (ECI) చేపడుతున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)’ ప్రక్రియను పాఠ్యాంశంగా చేర్చింది. ‘భారత్ లోపలి, వెలుపలి సమాజాల అధ్యయనం’ పేరుతో రూపొందించిన కొత్త పుస్తకంలో ఈ అంశానికి చోటు కల్పించింది. పాఠ్యపుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం, అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో ఉండేలా చూడడం, అనర్హుల పేర్లను తొలగించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించడమే ‘సర్’ ప్రధాన ఉద్దేశమని వివరించింది. తప్పుడు సమాచారం, ఫేక్ వార్తలు, బెదిరింపులు వంటి సవాళ్ల మధ్య కూడా ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను కొనసాగిస్తోందని పాఠంలో ప్రస్తావించింది.
గత ఏడాది నుంచి కొనసాగుతున్న ఈ ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా ఇప్పటివరకు ఆరు కోట్ల మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించినట్లు కూడా పాఠ్యపుస్తకంలో పేర్కొంది. ఈ ప్రక్రియపై ఎన్నికల సంఘం, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతున్న తరుణంలో, దీన్ని పాఠ్యాంశంగా చేర్చడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అదే పుస్తకంలో దేశ పౌరుల హక్కుల పరిరక్షణలో భారత న్యాయవ్యవస్థ నిష్పాక్షికంగా పనిచేస్తోందని కూడా ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొంది. గతంలో 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థను తక్కువ చేసి చూపేలా ఉందంటూ విమర్శలు రావడంతో, తాజా పాఠ్యాంశంలో న్యాయవ్యవస్థ పాత్రను స్పష్టంగా వివరించింది. ఇక త్రిభాషా సూత్రంపై కూడా ఎన్‌సీఈఆర్‌టీ స్పష్టత ఇచ్చింది. రెండు విదేశీ భాషలను ఎంపిక చేసుకుని చదువుతున్న 7వ, 9వ తరగతి విద్యార్థులు అదే భాషలను 10వ తరగతి వరకు కొనసాగించవచ్చని తెలిపింది. కనీసం రెండు దేశీయ భాషలు తప్పనిసరిగా చదవాలనే నిబంధన ఆరో తరగతి నుంచి కొత్తగా ప్రవేశించే విద్యార్థులకే వర్తిస్తుందని ఎన్‌సీఈఆర్‌టీ స్పష్టం చేసింది.
