– జపాన్ సమీపంలో శాస్త్రవేత్తల కీలక ఆవిష్కరణ
జపాన్‌కు దక్షిణాన పసిఫిక్ మహాసముద్ర గర్భంలో శాస్త్రవేత్తలు భారీ బంగారు నిల్వలను గుర్తించారు. ఇవి ఇప్పటివరకు గుర్తించిన సముద్ర గర్భ బంగారు నిక్షేపాల కంటే ఎక్కువగా ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ బంగారం హిగాషి-ఆగాషిమా అనే సముద్రగర్భ అగ్నిపర్వత ప్రాంతంలో లభించింది. ఇది టోక్యోకు దక్షిణంగా సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2015లో ఈ ప్రాంతాన్ని మొదట గుర్తించారు.
సముద్ర అడుగున ఉండే హైడ్రోథర్మల్ వెంట్లు నుంచి అత్యంత వేడిగా ఉన్న నీరు, ఖనిజాలు బయటకు వస్తుంటాయి. ఇవి చల్లటి సముద్ర నీటితో కలవడంతో రాగి, జింక్, వెండి, బంగారం వంటి ఖనిజాలు పేరుకుపోతాయి.
తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు రాళ్ల నమూనాలను అత్యాధునిక పరికరాలతో పరిశీలించగా, బంగారం బయటకు కనిపించే రూపంలో కాకుండా ‘పైరైట్’ అనే ఖనిజంలో సూక్ష్మ కణాల రూపంలో దాగి ఉన్నట్లు గుర్తించారు. పైరైట్ను సాధారణంగా ‘ఫూల్స్ గోల్డ్’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అది బంగారంలా మెరుస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం, ఈ ప్రాంతంలోని పైరైట్లో ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా నమోదు కానంత ఎక్కువ స్థాయిలో బంగారం ఉన్నట్లు తేలింది. ప్రత్యేక పరీక్షల ద్వారానే ఈ ‘కనిపించని బంగారం’ను గుర్తించగలిగారు.
ఈ ఆవిష్కరణతో భవిష్యత్తులో సముద్ర గర్భంలో బంగారం తవ్వకాలపై ఆసక్తి పెరుగుతోంది. అయితే ఇది అంత సులభం కాదు. సముద్ర గర్భం నుంచి ఈ సూక్ష్మ బంగారాన్ని తక్కువ ఖర్చుతో వెలికితీయడానికి ఇంకా సరైన సాంకేతికత అందుబాటులో లేదు.
మరోవైపు, ఈ హైడ్రోథర్మల్ వెంట్ల చుట్టూ అరుదైన సముద్ర జీవులు నివసిస్తుంటాయి. బంగారం తవ్వకాలు చేపడితే ఈ జీవావరణానికి నష్టం జరిగే ప్రమాదం ఉందని సముద్ర శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందువల్ల తవ్వకాలకు ముందు పర్యావరణ ప్రభావంపై సమగ్ర అధ్యయనం అవసరమని వారు సూచిస్తున్నారు. ఈ పరిశోధనతో జపాన్ సమీపంలోని హిగాషి-ఆగాషిమా ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత విలువైన సముద్రగర్భ బంగారు నిక్షేపాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
