– మళ్లీ చర్చకు ‘డూమ్స్‌డే ఆర్గ్యుమెంట్’
మానవజాతి అంతానికి గడువు ఆసన్నమవుతోందా అనే దాని మీద చర్చ నడుస్తోంది. దీనిపై శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మానవజాతి ఇంకెంతకాలం మనుగడ సాగిస్తుందనే ప్రశ్నకు గణితశాస్త్రం ద్వారా సమాధానం చెప్పే ప్రయత్నం చేసిన ‘డూమ్స్‌డే ఆర్గ్యుమెంట్’ అనే వివాదాస్పద సిద్ధాంతం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సిద్ధాంతం ప్రకారం మానవజాతి అంతం చాలామంది ఊహించిన దానికంటే త్వరగా జరిగే అవకాశం ఉందని గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఇది భవిష్యత్తును కచ్చితంగా అంచనా వేసే సిద్ధాంతం కాదని, అసలు ఇది జరుగుతుందా కాదా అన్న అంశం ఆధారంగా రూపొందించిన గణిత వాదన మాత్రమేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
‘కోపర్నికన్ సూత్రం’ ఆధారంగా సిద్ధాంతం
డూమ్స్‌డే ఆర్గ్యుమెంట్‌కు పునాది ‘కోపర్నికన్ ప్రిన్సిపుల్’. దీని ఆధారంగా ప్రపంచంలో మనిషికి ప్రత్యేకమైన స్థానం వుంది. చరిత్రలో కూడా మన ప్రస్తుత కాలం ప్రత్యేకమని భావించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ ఆలోచన ఆధారంగానే మానవజాతి భవిష్యత్తును గణాంకాల ద్వారా అంచనా వేయడానికి ప్రయత్నించారు.
ఎవరు ప్రతిపాదించారు?
ఈ సిద్ధాంతాన్ని మొదట ఖగోళ భౌతిక శాస్త్రవేత్త బ్రాండన్ కార్టర్ ప్రతిపాదించారు. తర్వాత ఖగోళ శాస్త్రవేత్త జె. రిచర్డ్ గాట్ దీనిని మరింత విస్తరించి వివరణ ఇచ్చారు. ఈ సిద్ధాంతం భూమిపై ఏదైనా నిర్దిష్ట విపత్తు సంభవిస్తుందని చెప్పదు.
సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది?
ఈ వాదన ప్రకారం మనలో ప్రతి ఒక్కరూ ఇప్పటివరకు పుట్టిన, భవిష్యత్తులో పుట్టబోయే మొత్తం మానవుల్లో యాదృచ్ఛికంగా ఎంపికైన ఒక వ్యక్తిగా భావించాలి. అలా భావిస్తే మానవజాతి ఇంకా కోట్లాది సంవత్సరాలు కొనసాగుతుందనే అవకాశంకంటే, దాని జీవితకాలం ఇప్పటికే మధ్య లేదా చివరి దశకు చేరుకుని ఉండే అవకాశమే ఎక్కువగా ఉంటుందని ఈ గణాంక వాదన సూచిస్తుంది. ఇది కేవలం గణిత సంభావ్యతపై ఆధారపడిన ఆలోచన మాత్రమే.
మద్దతుదారులు ఏమంటున్నారు?
ఈ సిద్ధాంతానికి మద్దతు ఇచ్చేవారి అభిప్రాయం ప్రకారం, ఇది భవిష్యత్తును చెప్పే జోస్యం కాదు. మానవజాతి భవిష్యత్తుపై సంభావ్యతలను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే ఒక గణాంక పద్ధతి మాత్రమే.
విమర్శకుల అభిప్రాయం
అయితే అనేక మంది శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు ఈ సిద్ధాంతాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారి వాదన ప్రకారం… ఈ సిద్ధాంతం చాలా సరళమైన ఊహాగానాలపై ఆధారపడింది. మానవ సమాజ అభివృద్ధి, శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి, అనుకూలించగల మానవ సామర్థ్యాన్ని ఇది పరిగణనలోకి తీసుకోదు. అందువల్ల మానవజాతి భవిష్యత్తును విశ్వసనీయంగా అంచనా వేయలేదని అంటున్నారు.
ఎందుకు మళ్లీ చర్చలోకి వచ్చింది?
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అస్తిత్వ ముప్పులు ఈ సిద్ధాంతంపై మళ్లీ ఆసక్తి పెరగడానికి కారణమయ్యాయి. ఎందుకంటే ముఖ్యంగా వాతావరణ మార్పులు, కృత్రిమ మేధస్సు (AI), మహమ్మారి రోగాలు, అణుయుద్ధ ముప్పు వంటి అంశాలు మానవజాతి దీర్ఘకాలిక భవిష్యత్తుపై ఆందోళనలను పెంచుతున్నాయి.
శాస్త్రవేత్తల హెచ్చరిక
అస్తిత్వ ముప్పులపై పరిశోధనలు చేస్తున్న నిపుణులు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. డూమ్స్‌డే ఆర్గ్యుమెంట్‌ను మానవజాతి త్వరలోనే అంతరించిపోతుందనే ఆధారంగా ఎట్టి పరిస్థితుల్లోనూ భావించకూడదని వివరిస్తున్నారు. గణిత నమూనాలు అనిశ్చిత పరిస్థితులను విశ్లేషించడంలో ఉపయోగపడతాయి. కానీ అవి.. భవిష్యత్ సాంకేతిక విప్లవాలు, సామాజిక మార్పులు, మానవుల అనుకూల సామర్థ్యం వంటి అంశాలను ముందుగానే అంచనా వేయలేవని వివరిస్తున్నారు. మానవ అంతానికి తేదీ చెప్పగల నమూనా లేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం శాస్త్ర ప్రపంచంలో మానవజాతి అంతం ఎప్పుడు జరుగుతుందో చెప్పగలిగే విశ్వసనీయ శాస్త్రీయ నమూనా ఏదీ లేదు. దాని బదులు శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఎదురవుతున్న వాస్తవ ప్రమాదాలను తగ్గించడంపైనే దృష్టి సారిస్తున్నారు. అందులో.. కొత్త అంటువ్యాధులు, పర్యావరణ విధ్వంసం, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, అణు ఆయుధాల ముప్పు వంటి అంశాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.
