థాయ్‌లాండ్‌లో మహా వింత

Dynosar

ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద డైనోసార్ గుర్తింపు!

​తొమ్మిది ఏనుగుల బరువు, 90 అడుగుల పొడవుతో సంచలనం

​పరిణామ క్రమ సిద్ధాంతాలను మార్చేస్తున్న ‘నాగాటైటాన్ చైయాఫుమెన్సిస్’

​ప్రపంచవ్యాప్తంగా డైనోసార్ల పరిణామ క్రమంపై జరుగుతున్న పరిశోధనల్లో సరికొత్త అధ్యాయం . ఇప్పటివరకు ఉత్తర అమెరికా, చైనాల్లోనే భారీ డైనోసార్ల ఆవాసాలు ఉన్నాయనే అంచనాలకు భిన్నంగా.. ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద శాకాహార జీవి అవశేషాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. థాయ్‌లాండ్‌లో వెలుగుచూసిన ఈ మహాకాయుడికి ‘నాగాటైటాన్ చైయాఫుమెన్సిస్’ అని నామకరణం చేశారు. 27 మీటర్ల (దాదాపు 90 అడుగులు) పొడవుండే ఈ జీవి బరువు.. దాదాపు తొమ్మిది ఏనుగులతో సమానమని పరిశోధకులు తేల్చారు.

​చెరువు ఒడ్డున రాళ్లు అనుకుంటే.. కోట్ల ఏళ్ల నాటి ఎముకలు!

​ఈ అద్భుత ఆవిష్కరణ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. 2016 లో థాయ్‌లాండ్‌లోని చైయాఫుమ్ ప్రావిన్స్‌కు చెందిన థానోమ్ లువాంగ్‌నాన్ అనే స్థానికుడు ఒక చెరువు పక్కన వింతగా ఉన్న కొన్ని పెద్ద రాళ్లను చూశాడు. వాటి ఆకారం అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరపగా, అవి సాధారణ రాళ్లు కావని.. సుమారు 11.3 కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్ శిలాజాలని తేలింది. అక్కడ జరిపిన తవ్వకాల్లో వెన్నెముక, పక్కటెముకలు, తుంటి భాగాలతో పాటు భారీ కాలి ఎముకలు లభ్యమయ్యాయి.

​మనిషంత పొడవున్న కాలి ఎముక!

​ఈ డైనోసార్ శరీర నిర్మాణంలో శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురిచేసింది దాని కాలి ఎముకే. కేవలం దాని  పొడవే ఏకంగా 1.78 మీటర్లు ఉంది. సగటున మానవుడి ఎత్తుతో ఇది సమానం. దీని ఆధారంగానే ఈ జీవి తల నుంచి  తోక వరకు ఎంత భారీ పరిమాణంలో ఉండేదో శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

​పేరు వెనుక పురాణ గాథ..

​ఈ విలక్షణ జీవికి ప్రాంతీయ గుర్తింపుతో పాటు పురాణాల కలయికగా పేరు పెట్టారు.

​నాగా: ఆగ్నేయాసియా సంస్కృతి, పురాణాల్లోని శక్తివంతమైన సర్పరాజు.

​టైటాన్: గ్రీకు పురాణాల ప్రకారం మహాకాయులు అని అర్థం.

​చైయాఫుమెన్సిస్: ఇది లభించిన చైయాఫుమ్ ప్రాంతానికి గుర్తుగా చేర్చారు.

​శాస్త్రీయంగా ఇది ‘సోంఫోస్పాండిలన్’ అనే సౌరోపాడ్ డైనోసార్ వర్గానికి చెందినది. భవిష్యత్తులో భూమిని శాసించిన రాక్షస డైనోసార్లకు (టైటానోసార్లు) ఇవే మూలపురుషులని భావిస్తున్నారు.

​ఆహార విందు: అంతం లేని వృక్ష సంపద

నాగాటైటాన్ జీవించిన కాలంలో భూగోళంపై ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండేవి. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం కూడా అధికమే. అప్పట్లో ఆగ్నేయాసియా ప్రాంతం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండటం వల్ల దట్టమైన అడవులు, కొనిఫర్ వృక్షాలు, ఫెర్న్ మొక్కలు అపరిమితంగా పెరిగేవి. ఈ భారీ శాకాహార జీవుల ఆకలి తీర్చడానికి ప్రకృతి సిద్ధం చేసిన అంతం లేని ‘ఆహార విందు’ లా ఈ ప్రాంతం విరాజిల్లింది.

​పర్యావరణాన్ని మార్చేసిన మేత

​ప్రస్తుత కాలంలో ఏనుగులు తమ ఆహార అలవాట్లతో అడవుల రూపురేఖలను ఎలా మారుస్తాయో, నాగాటైటాన్లు కూడా కోట్ల సంవత్సరాల క్రితం అదే పని చేశాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి నిరంతరం మొక్కలను మేయడంతో  దట్టమైన అడవులు కాస్తా విశాలమైన గడ్డి మైదానాలుగా మారేవి.

​ఈ పరిశోధనలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. డైనోసార్లు ఒకే ఒక వంశం నుంచి  అంత పెద్దగా మారలేదని, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కి పైగా విభిన్న సౌరోపాడ్ వంశాలు వేర్వేరు ఖండాల్లో స్వతంత్రంగా భారీ పరిమాణాన్ని సంతరించుకున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

​తీవ్రమైన వేడిని తట్టుకుంది ఎలా?

​అంత భారీ శరీరం ఉండి, అంతటి వేడి వాతావరణంలో ఇవి ఎలా మనుగడ సాగించాయనే దానికి కూడా సమాధానం దొరికింది.

​పొడవైన మెడలు: వీటి పొడవైన మెడల ద్వారా శరీరంలోని అదనపు వేడి సులభంగా బయటకు వెళ్లేది.

​తేలికపాటి ఎముకలు: వీటి ఎముకల్లో గాలి గదులు (ఎయిర్ సాక్స్) ఉండటం వల్ల బరువు తగ్గడమే కాకుండా, శరీరాన్ని చల్లబరిచే ఏసీ లాగా పని చేసేవి.

​పరిశోధనల్లో సరికొత్త మైలురాయి

​సాధారణంగా చైనా, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో డైనోసార్ శిలాజాలు ఎక్కువగా దొరుకుతాయి. ఆగ్నేయాసియాలో ఇలాంటి ఆధారాలు లభించడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో ‘నాగాటైటాన్ చైయాఫుమెన్సిస్’ ఆవిష్కరణ ఆసియా ఖండంలో మహాకాయ సౌరోపాడ్ల ఎదుగుదల, వాటి పరిణామ క్రమ రహస్యాలను ఛేదించడంలో శాస్త్రవేత్తలకు ఒక మైలురాయిగా నిలవనుంది.