ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయండి..

Cpi

లేదంటే మోదీనే రాజీనామా చేయాలి..
27న అన్ని జిల్లాల కలెక్టరేట్లు, లోక్ భవన్ ఎదుట ఆందోళనలకు సీపీఐ పిలుపు

విజయవాడ: నీట్ పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని, అది చేయకుంటే ఆ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో ఈ నెల 27న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లతో పాటు విజయవాడలోని లోక్‌భవన్ (గవర్నర్ కార్యాలయం) ఎదుట రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సీపీఐ పిలుపునిచ్చిందన్నారు. పార్టీ జాతీయ సమితి దేశవ్యాప్త పిలుపులో భాగంగానే ఈ ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు. విజయవాడ దాసరి భవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును కాపాడడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ముందుగా ‘బద్లావ్ జరూరీ హై-మార్పు కావాలి’ నినాదంతో ఆగస్టు 6 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రచార పాదయాత్రలు, ఆగస్టు 17 నుంచి 28 వరకు ప్రజా సంఘాల రోజు వారీ ఆందోళనల పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఈశ్వరయ్య ఆవిష్కరించారు.

ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్, నెట్, టెట్, సీబీఎస్ఈ పరీక్షలు లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందన్నారు.  ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలపై జరిగిన లాఠీచార్జ్‌ను సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. నిరసనలకు దిగిన మహిళల ప్రైవేట్ భాగాల్లో పోలీసులు దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. నీట్ లీక్‌ల వ్యవహారంపై కూటమిలో భాగస్వామిగా ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంపై .. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఒత్తిడి చేయాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో 85వేల మంది నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు ఈ లీక్‌లకు ప్రభావితమయ్యారని, దీంతో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం లేదా నిరసనలకు బహిరంగ మద్దతు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. సుప్రీంకోర్టు స్పందన సరిపోవడం లేదని విమర్శిస్తూ, విద్యార్థుల సమస్యపై న్యాయపరమైన జోక్యం అవసరమని చెప్పారు. 1997లో ఒడిశాలో పేపర్ లీక్ అయినప్పుడు అప్పటి ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ ఆందోళనలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు మీరు చేస్తే న్యాయమా?, ఇప్పుడు నీట్ లీక్‌లపై విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తే, న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరకు సంఘీభావంగా వెళ్లిన వారంతా సంఘ విద్రోహ శక్తులేనా?, అని నిలదీశారు.

బీజేపీ పాలనలో ప్రశ్నించే గొంతుకను అణచివేస్తారా? అని ధ్వజమెత్తారు. దిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థులపై పోలీసుల దాడి కేసులో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తనకు వీడియోలు చూసే సమయం లేకుంటే ఆయన పదవికి రాజీనామా చేయవచ్చని అన్నారు. ఇలాంటి వైఖరితోనే న్యాయ స్థానాల్లో లక్షల సంఖ్యల్లో కేసులు పెండింగ్‌లో పేరుకుపోతున్నాయని చెప్పారు. నీట్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని, ఎన్‌టీఏను రద్దు చేసి, నీట్ నిర్వహణ బాధ్యతలను ఆయా రాష్ట్రాలకు తమ మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించే హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువజనులు, ఉద్యోగులు, గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాల కోసం పోరాడతామని చెప్పారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి, అక్కినేని వనజ, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.