బ్రిటిష్ జర్నలిస్టు రాబర్ట్ పెస్టన్ హెచ్చరిక
2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, కోవిడ్-19 మహమ్మారి వంటి కీలక పరిణామాలను ముందుగానే హెచ్చరించిన సీనియర్ బ్రిటిష్ జర్నలిస్టు రాబర్ట్ పెస్టన్ ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI)పై మరో తీవ్రమైన హెచ్చరిక చేశారు. ఏఐ వేగంగా విస్తరిస్తుండటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండేళ్లలో ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం
తన కొత్త థ్రిల్లర్ నవల ‘ది కిల్ స్విచ్’ (The Kill Switch) ప్రచారంలో భాగంగా రేడియో టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెస్టన్ ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు. వచ్చే ఒకట్రెండు సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి ప్రధాన కారణంగా ఆయన ఏఐ కోసం భారీగా నిర్మిస్తున్న డేటా సెంటర్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై జరుగుతున్న అపార పెట్టుబడులను పేర్కొన్నారు.
ఏఐ పెట్టుబడులే ప్రమాద సంకేతమా?
‘ఏఐ కోసం డేటా సెంటర్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో ఊహించలేనంత డబ్బు పెట్టుబడిగా వెళ్తోంది. ఇదే ప్రపంచవ్యాప్తంగా మరో ఆర్థిక సంక్షోభానికి దారితీయవచ్చని నాకు నిజంగా ఆందోళనగా ఉంది’ అని పెస్టన్ అన్నారు. గతంలో తాను చేసిన హెచ్చరికలు నిజమైనప్పటికీ, ప్రజలు వాటిని సీరియస్‌గా తీసుకోలేదని కూడా వ్యాఖ్యానించారు. ‘పరిస్థితులు చాలా దారుణంగా మారబోతున్నాయని చెప్పినప్పుడు ప్రజలు ఎందుకు వినరు?’ అని ఆయన ప్రశ్నించారు.
‘ది కిల్ స్విచ్’లో ఏఐ ప్రమాదాలే ప్రధానాంశం
రాబర్ట్ పెస్టన్ రాసిన తాజా థ్రిల్లర్ ‘ది కిల్ స్విచ్’లో కృత్రిమ మేధస్సు వల్ల ఏర్పడే ప్రమాదాలను ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఏఐ అభివృద్ధి వల్ల సమాజం, ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై పడే ప్రభావాలను ఈ నవలలో చర్చించినట్లు తెలిపారు.
ప్రపంచ నాయకులు ఏఐపై దృష్టి పెట్టాలి
ప్రపంచ నాయకులు ప్రస్తుతం చర్చిస్తున్న ఇతర విధానాల కంటే ఏఐ వల్ల ఎదురయ్యే సవాళ్లకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పెస్టన్ అభిప్రాయపడ్డారు. ‘ఇప్పుడంతా చర్చించాల్సిన అసలు అంశం ఇదే. ప్రపంచ నాయకులు మరే అంశం కంటే ఎక్కువగా ఏఐ గురించి మాట్లాడాలి. కానీ అలా జరగడం లేదు. అదే నన్ను ఎక్కువగా కలవరపెడుతోంది’ అని ఆయన అన్నారు.
