చదువే జీవితాన్ని మార్చే శక్తి

Aktpm

పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన ఏడుగురు విద్యార్థులకు రూ.14 వేల నగదు బహుమతి

విజయవాడ : చదువే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చే ప్రధాన మార్గమని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా పట్టుదలతో కృషి చేస్తే గొప్ప విజయాలను సాధించగలరని సత్యనారాయణపురం ఏకేటీపీఎం (AKTPM) పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పింగళి రాయల్ పేర్కొన్నారు. ప్రతిభను ప్రోత్సహించడం, విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఏకేటీపీఎం పాఠశాలలో ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ఏడుగురు విద్యార్థులకు మొత్తం రూ.14 వేల నగదు బహుమతులను పూర్వ విద్యార్థుల సంఘం తరఫున అందజేశారు. విద్యార్థుల కృషిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని చదువులో రాణించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పింగళి రాయల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై సమాజంలో ఉన్న అపోహలు తొలగిపోతున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు నేడు దేశ, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు, కీలక పదవుల్లో సేవలందిస్తున్నారని అన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, మెరుగైన విద్యా వాతావరణం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, విద్యా ప్రోత్సాహక పథకాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవడం సాధ్యమవుతుందని ఆయన సూచించారు. విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశయాలను నెరవేర్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉమర్ అలీ, పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి ఎం. వాసు, సభ్యులు బొగ్గవరపు సత్యనారాయణ, కూచిభొ ట్ల పూర్ణయ్య శాస్త్రి, ఆర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. పూర్వ విద్యార్థుల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలో మరింత సానుకూల దృక్పథాన్ని ఏర్పరుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.