కుక్కలకు మనుషుల మధ్య బంధం వేల ఏళ్ల నాటిదే..

Dog

పెంపుడు కుక్కలన్నీ ఒకే జాతికి చెందినవే అయినప్పటికీ, పుట్టిన దగ్గర నుంచి పెరిగే వరకు వాటి ఆకారాలు, పరిమాణాలు భిన్నంగా ఉంటాయి. ఈ తేడాలు ఎప్పుడు ప్రారంభమైంది? మనిషి-కుక్కల బంధం ఎంత పురాతనమైనదా అనే ప్రశ్నలకు తాజాగా సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన రెండు అధ్యయనాలు కొత్త సమాధానాలు ఇచ్చాయి. ఒక అధ్యయనం పురాతన కుక్కల పుర్రెల ఆకృతులను పరిశీలించగా, మరో అధ్యయనం వేల ఏళ్ల నాటి కుక్కల డిఎన్ ఏను విశ్లేషించింది. ఈ రెండు పరిశోధనలు కుక్కల వైవిధ్యం, మనుషులతో వాటి అనుబంధం గతంలో భావించిన దాని కంటే చాలా పురాతనమని వెల్లడించాయి.

11 వేల ఏళ్ళ క్రితమే

ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మాంట్‌పెలియర్‌కు చెందిన అలోవెన్ ఎవిన్ నేతృత్వంలోని బృందం 50 వేల సంవత్సరాల కాలానికి చెందిన 643 కుక్కలు, తోడేళ్ల పుర్రెలను పరిశీలించింది. వారి అధ్యయనం ప్రకారం, నేటి కుక్కలను పోలిన ప్రత్యేక పుర్రె ఆకారం సుమారు 11 వేల సంవత్సరాల క్రితం, చివరి మంచు యుగం అనంతరం ప్రారంభమైన హోలోసీన్ కాలంలో కనిపించింది. అప్పటికే కుక్కల పుర్రెల్లో గణనీయమైన వైవిధ్యం కనిపించడం వల్ల, నేడు కనిపించే కుక్కల రకాలు కేవలం గత కొన్ని శతాబ్దాలుగా మనుషులు చేసిన ఎంపిక పెంపకం వల్ల మాత్రమే ఏర్పడలేదని పరిశోధకులు చెబుతున్నారు.

అంతకుముందు కుక్కలు కూడా తోడేళ్లలాగే

పరిశోధకులు 50 వేల ఏళ్ళ వరకు పురాతనమైన 17 పుర్రెలను మరోసారి విశ్లేషించారు. వీటిలో కొన్ని గతంలో తొలి కుక్కలవిగా భావించినప్పటికీ, అన్ని పుర్రెలు ఆకారంలో దాదాపు తోడేళ్లలాగే ఉన్నట్లు తేలింది. కుక్కలు, తోడేళ్ల మధ్య జన్యుపరమైన విభజన అంతకుముందే జరిగినప్పటికీ, శరీర ఆకృతిలో స్పష్టమైన మార్పులు 11 వేల ఏళ్ళ క్రితమే మొదలయ్యాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

డిఎన్ ఏ చెప్పిన మరో ఆసక్తికర కథ

రెండో అధ్యయనాన్ని చైనాలోని కున్మింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జువాలజీకి చెందిన షావో జీ జాంగ్ బృందం నిర్వహించింది. వారు పదేళ్లకు చెందిన 73 పురాతన కుక్కల జన్యుక్రమాలను విశ్లేషించారు. ఈ పరిశోధనలో తూర్పు యురేషియాలో వేటగాళ్లు, రైతులు, పశుపోషకులు వంటి వివిధ మానవ సమూహాలు వలస వెళ్లినప్పుడు, వారి కుక్కలు కూడా వారితో కలిసి ప్రయాణించినట్లు తేలింది. దీంతో కుక్కల డిఎన్ ఏ , పురాతన మానవ వలసల చరిత్రను అర్థం చేసుకునే కీలక ఆధారంగా మారింది.

ఆశ్చర్యపరిచిన జన్యు వ్యత్యాసం

కొన్ని ప్రాంతాల్లో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. వెరెట్యే , బొటాయ్ ప్రాంతాల్లో నివసించిన వేటగాళ్లు జన్యుపరంగా పశ్చిమ యురేషియా ప్రజలకు దగ్గరగా ఉన్నప్పటికీ, వారి కుక్కలు మాత్రం తూర్పు లేదా ఆర్కిటిక్ ప్రాంతాల కుక్కల వంశాలకు చెందినవిగా తేలాయి. దీంతో కుక్కలు కేవలం యజమానులతో కలిసి వలస వెళ్లడమే కాకుండా, వివిధ మానవ సమాజాల మధ్య వ్యాపారం లేదా సాంస్కృతిక మార్పిడిలో కూడా భాగమయ్యి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

కుక్కలు కూడా జీవ-సాంస్కృతిక ప్యాకేజీలు

ఈ అధ్యయనం ప్రకారం, ప్రాచీన మానవ సమూహాలు కొత్త ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు అక్కడ కొత్త కుక్కలను పెంచుకోకుండా, తమతో ఉన్న కుక్కలనే వెంట తీసుకెళ్లేవారు. అవసరమైతే ఇతర సమాజాలతో వాటిని మార్పిడి కూడా చేసేవారు. అంటే కుక్కలు కూడా మనుషుల సంస్కృతి, జీవనశైలిలో భాగమైన ‘బయోకల్చరల్ ప్యాకేజీలు ‘గా వ్యవహరించాయని పరిశోధకులు పేర్కొన్నారు.

మనిషి చరిత్రను చెప్పే కుక్కలు

ఈ రెండు అధ్యయనాల ప్రకారం, నేడు కనిపించే కుక్కల అసాధారణ వైవిధ్యానికి పునాది వేల ఏళ్ల క్రితమే పడింది. సహజ ఎంపిక, ప్రారంభ మానవ ఎంపిక, భిన్నమైన వాతావరణ పరిస్థితులు కలిసి ఈ పరిణామానికి దోహదపడ్డాయి.కుక్కల జన్యువులను అధ్యయనం చేయడం ద్వారా పురాతన మానవ వలసలు, వాణిజ్య సంబంధాలు, సాంస్కృతిక మార్పిడిపై కూడా కొత్త సమాచారం తెలుసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భవిష్యత్తులో మరిన్ని పురాతన కుక్కల శిలాజాలు, డిఎన్ ఏ నమూనాలను పరిశీలించడం ద్వారా మనిషి-కుక్కల మధ్య ప్రపంచంలోనే అత్యంత పురాతన స్నేహబంధం ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైందో స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.