విజయవాడ దుర్గాపురం విజయ్ నర్శింగ్ కళాశాలలో వయోవృధ్ధ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని శతాధిక వృద్ధుల సన్మానోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్ అన్నారు. స్ధానిక విజయ్నర్శింగ్ కళాశాలలో సోమవారం శతాధిక వృద్ధుల సన్మానోత్సవం కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది మంది శతాధిక వృద్ధులను ఒక్కచోట చేర్చి వారి ఆశీస్సులు తీసుకుంటే సాక్షాత్తూ దైవం ఆశీర్వాదం తీసుకున్నట్లేనని పురాణాలు చెబుతున్నాయన్నారు. వంద సంవత్సరాలు జీవించటం సామాన్య విషయం కాదని.. నూరు సంవత్సరాలు జీవించిన శతాధిక వృద్దుల సందేశం ప్రజలకి అందజేయటంతో పాటు ప్రతీ ఒక్కరికీ దైవానుగ్రహం లభించాలని తాము శతాధిక వృద్ధుల సన్మానోత్సవం ప్రతీ ఏటా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన శతాధిక వృద్ధులను తాము గుర్తించి సత్కారం నిర్వహించనున్నట్లు తెలిపారు. శతాధిక వృద్ధుల సమాచారం తమకు ఇస్తే తాము స్వయంగా వారి ఇంటికి వెళ్ళి అన్ని ఖర్చులను తామే భరించి ఇక్కడకు తీసుకువచ్చి ప్రముఖుల చేతులమీదుగా నగదు పురస్కారంతో సత్కారం నిర్వహించి తిరిగి ఇంటివద్ద దింపనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కడా కూడా జరగని ఇంతటి మహత్తర కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొని శతాధిక వృద్ధుల ఆశీర్వాదం తీసుకోవాలని కోరారు. ట్రస్ట్ వైస్ ఛైర్మన్ తేజ్రాజ్ సోలంకీ, ట్రస్టీ తట్టి అర్జునరావు మాట్లాడుతూ శతాధిక వృద్దుల సత్కారంకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు. శతాధిక వృద్దుల సమాచారంను వచ్చేనెల ఒకటో తేదీలోపు 9347572766, 9848111138 నంబర్లలో తెలియ చేయాల్సిందిగా కోరారు.అనంతరం ట్రస్టీలు కె మధుసూధనరావు, పీ లక్ష్మీనరసింహరావు, వెంకటేష్ గోదావరి తదితరులతో కలిసి సన్మానోత్సవం కరపత్రాలు ఆవిష్కరించారు.
వచ్చేనెల 27న శతాధిక వృద్ధుల సన్మానోత్సవం
