- తెరపై ‘విజేత’..
- అభిమానుల గుండెల్లో ‘ఇంద్ర’
- ఆగస్టు 22.. చిరంజీవి పుట్టినరోజు
తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేర్లు కేవలం నటుల పేర్లు కావు.. అవి యుగాలు దాటిన ప్రభంజనాలు. ఏ విధమైన సినీ నేపథ్యం లేకుండా, కేవలం కష్టపడే తత్వాన్నే నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చి, బాక్సాఫీస్ వద్ద విజయాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్న అరుదైన విజేత మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22. ఒక నటుడి ప్రయాణం ఎలా ఒక తరం జ్ఞాపకంగా మారుతుందో చెప్పడానికి చిరంజీవి సినీ ప్రస్థానం ఒక అద్భుతమైన ఉదాహరణ.
పసివాడి ప్రాణం నుంచి గ్యాంగ్ లీడర్ వరకు
మొదట్లో చిన్న చిన్న పాత్రలతో ప్రయాణం ప్రారంభించినా, ‘ప్రాణం ఖరీదు’తో తన ముద్ర వేసి, పసివాడి ప్రాణంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల బోణి కొట్టారు. ఆ రోజుల్లో మాస్ ప్రేక్షకులలో ఆయన తెచ్చుకున్న గుర్తింపు ఒక ఎత్తైతే, గ్యాంగ్ లీడర్గా థియేటర్లలో ఆయన సృష్టించిన సునామీ మరొక ఎత్తు. డాన్సుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి, తెలుగు ప్రేక్షకులకు గ్రేస్ అంటే ఏంటో నేర్పించిన ఘనత ఆయనదే.
వైవిధ్యమే ఆయన మార్గం.. స్వయంకృషికి మారుపేరు
కేవలం మాస్ యాక్షన్ చిత్రాలకే పరిమితం కాకుండా, కళాత్మక చిత్రాలలో కూడా తన నటనతో మెప్పించారు. ‘రుద్రవీణ’, ‘ఆపద్బాంధవుడు’, స్వయంకృషి వంటి చిత్రాలలో చిరంజీవి కనబరిచిన అభినయం ఆయనలోని నటుడిని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్ళింది. కమర్షియల్ సక్సెస్ వెనుక పరిగెడుతున్న కాలంలో కూడా సామాజిక స్పృహ ఉన్న కథలను ఎంచుకుని, తన సవాల్ను స్వీకరించి విజయం సాధించారు. చిరంజీవి సినిమాల్లో పాటలు, స్టెప్పులు, పంచ్ డైలాగులు ఎంత గుర్తుండిపోతాయో.. ఆయన పాత్రలు ఇచ్చిన సందేశాలు కూడా అంతే చిరస్మరణీయం.
రీఎంట్రీలోనూ అదే హవా.. ఖైదీ నంబర్ 150 నుంచి వాల్తేరు వీరయ్య వరకు
కొంతకాలం సినిమా రంగానికి దూరమైనా, ప్రేక్షకుల గుండెల్లో ఆయన స్థానం కొంచెం కూడా మారలేదని ఖైదీ నంబర్ 150 నిరూపించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వాల్తేరు వీరయ్యగా మాస్ రికార్డులను తిరగరాస్తూ, బాక్సాఫీస్ వద్ద తానెప్పుడూ ‘నెంబర్ వన్’ అని చాటిచెప్పారు. ఆయన నటనలోని ఈ జోష్, ఉత్సాహం ఈనాటి యువ నటులకు కూడా నిత్య స్ఫూర్తిప్రదాయకం.
సమాజ సేవలో ‘ఆపద్బాంధవుడు’
సినీ రంగానికే కాకుండా, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడి, ఆపద్బాంధవుడుగా ప్రజాదరణ పొందేలా చేశారు. తెరపైనా, తెర వెనుకా ఆయన చూపించే ఈ ఉదారత కోట్లాది మంది అభిమానులకు ఆయనను ఒక ఒక మార్గదర్శిగా నిలబెట్టింది. తన అపారమైన అనుభవం.. నిరంతర శ్రమతో తెలుగు చలనచిత్ర సీమను దశాబ్దాల పాటు ఏలిన, ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు.
