మచిలీపట్నం: ప్రజాసేవలో విశేషంగా కృషి చేస్తున్న తుమ్మలపల్లి పరమేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, దస్తావేజులేఖరి తుమ్మలపల్లి హరికృష్ణకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. పంద్రాగస్టు సందర్భంగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు.
మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఇన్‌చార్జి కలెక్టర్ నవీన్ చేతుల మీదుగా హరికృష్ణ పురస్కారాన్ని స్వీకరించారు. సమాజ సేవ, ప్రజలకు అందుబాటులో ఉంటూ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
తుమ్మలపల్లి పరమేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హరికృష్ణ పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అవసరమైన వారికి తనవంతు సహాయ సహకారాలు అందించడంతో పాటు సామాజిక బాధ్యతతో కార్యక్రమాలు చేపడుతున్నారు. సేవా కార్యక్రమాల పట్ల ఆయన చూపుతున్న చొరవను పలువురు అభినందించారు.
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందని హరికృష్ణ తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని మరింత బాధ్యతగా భావించి భవిష్యత్‌లోనూ ప్రజా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని చెప్పారు. పురస్కారం అందుకున్న హరికృష్ణను పలువురు ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందించారు.
