స్కూలుకి లేటు అయిందని మాస్టారు కొట్టిన దెబ్బలు.. హోమ్ వర్క్ చేయలేదని టీచరమ్మ ఇచ్చిన పనిష్మెంట్స్.. సైకిల్ మీద స్కూల్ కి వచ్చి కాలరెగరేసిన రోజులు.. అమ్మాయిలను చూసి అబ్బాయిలు తలదువ్వుకున్న క్షణాలు.. అబ్బాయిల చూపులకు చిక్కకుండా ముసిముసిగా నవ్వుకుంటూ పమిట సర్దుకున్న సంఘటనలు.. పరీక్షల్లో మార్కుల కోసం ఆరాటం.. ఆ చదివి మాత్రం ఏం లాభంలే అనుకునే అనుభవం.. ఇవన్నీ ప్రతి ఒక్కరికీ మర్చిపోలేని అనుభవాలు. కాలం గడుస్తున్న కొద్దీ మనసు పొరల్లో దాగిపోయిన మధురానుభూతులు. అప్పట్లో అంటూ ఇప్పటి స్నేహితులకు లేదా పిల్లలకు చెప్పుకునే అందమైన అనుభవాలు.
పాతికేళ్ల తరువాత అప్పటి స్నేహితులంతా ఒకే వేదికపై కలిస్తే.. అప్పట్లో అల్లరివాడైన స్నేహితుడు ఒక ఆఫీసరు హోదాలో మన ముందు కనిపిస్తే . . ఒరే అనాలా ? ఏమండీ అనాలా అనే డౌటు. చదువుకునేటప్పుడు సరదాగా మనం కన్నుకొట్టిన అమ్మాయి ఇప్పుడు ప్రౌఢగా పిల్లల తల్లిగా బాధ్యతలు మోస్తున్న వనితగా ఎదురైతే నువ్వు అనాలా ? మీరు అనాలా ? అనే సందేహం . ఏమిటిదంతా అనుకుంటున్నారా ? ఒక్కసారి ఊహించండి పాతికేళ్ల క్రితం ఒకే తరగతిలో చదువుకున్న గడుగ్గాయిలు.. బాధ్యతల బరువుల మధ్య మల్లె ఒక చోట కలుసుకుంటే వచ్చే యిలాంటి సన్నివేశాలు ఎలా ఉంటాయో . సరిగ్గా ఇవే సన్నివేశాలు ఈ ఆదివారం (మే 24) విజయవాడలోని రైల్వే మిక్స్డ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో కనిపించాయి.
సరిగ్గా పాతికేళ్ల క్రితం అంటే 2000-2001 లో పదో తరగతి అదే స్కూల్ లో చదువుకున్న విద్యార్థులంతా ఈరోజు ఒక్క చోట చేరారు. తమ అలనాటి బంధానికి సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకున్నారు. వీరిలో చాలా మంది దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాల్లో.. వ్యాపారాల్లో.. సేవారంగాల్లో స్థిరపడినవారు. స్థానికంగా ఉద్యోగ, వ్యాపారాల్లో మునిగిపోయి జీవనం సాగిస్తున్న వారూ ఉన్నారు . వీరంతా ఒకేవేదికపై కలుసుకోవడమే కాదు . . అప్పుడు తమకు పాఠాలు చెప్పిన.. దండించిన ఉపాధ్యాయుల బెత్తం వెనుక ఉన్న బాధ్యతను . . ఆపేక్షను అర్ధం చేసుకుని వారిని సత్కరించి.. తమ ఇప్పటి ఉన్నతికి అప్పట్లో వారు వేసిన పునాదికి కృతఙ్ఞతలు తెలిపారు.
ఇక అప్పట్లో కోతుల్లా ఉండే తమ విద్యార్థులు ఇప్పుడు ఉన్నత స్థాయిలో తమ ముందు నిలబడి.. తమకు ఇస్తున్న గౌరవానికి ఉపాధ్యాయులు ఉప్పొంగిపోయారు . అప్పుడే కాదు ఇప్పుడూ మేము కోతులమే.. కాకపోతే కొంచెం బాధ్యతగా . . పద్ధతిగా అల్లరి చేస్తామంతే అంటూ సాంస్కృతిక కార్యక్రమాలు.. కేక్ కటింగ్స్ చేస్తూ ఒకరిని ఒకరు ఆప్యాయంగా హత్తుకుంటూ మరపురాని మధురానుభూతులను పంచుకుంటూ రోజంతా గడిపారు ఈ అపూర్వ విద్యార్థులు.
అప్పటి ఫొటోల ప్రదర్శన . . కాలం మారినా స్నేహం వాడిపోదంటూ అందరూ కలిసి పలికిన పలుకులు మానవ జీవితంలో ప్రతి మలుపు ఒక మధురమైన జ్ఞాపకమే అనే విధంగా ఈ అపూర్వ విద్యార్థుల కలయిక ఉత్సాహంగా . . ఉల్లాసంగా సాగింది.
ఇలా రైల్వే మిక్స్డ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం విజయవాడ పూర్వ విద్యార్థులు విద్యార్థి దశలో కలిసి చదివిన స్నేహితులు పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యాభ్యాసం పూర్తై 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ సమావేశం సిల్వర్ జూబ్లీ వేడుకలా మారింది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, సేవా రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకుని తమ అనుభవాలను పంచుకున్నారు. చదువుకున్న రోజుల్ని గుర్తు చేసుకుంటూ గురువులను ఆహ్వానించి వారిని సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, విద్యార్థి దశలో ఏర్పడిన స్నేహబంధాలు జీవితాంతం నిలిచిపోతాయని పేర్కొన్నారు. కాలం మారినా అనుబంధాలు మారవని, ఇలాంటి కలయికలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, జ్ఞాపికల అందజేత, పాత ఫోటోల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివరగా అందరూ కలిసి “25 వసంతాల స్నేహబంధం”ను గుర్తు చేసుకుంటూ సిల్వర్ జూబ్లీ కేక్ కట్ చేసి, చిన్నారి స్నేహమా.. చిరు నవ్వు చిందుమా అంటూ తమ సంతోషాన్ని ఒకరితో ఒకరు పంచుకుని వేడుకలను ముగించారు.
ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్న డాక్టర్ నోవా సందీప్, లక్ష్మీకాంత్, రాజేంద్ర, ధరన్, సాయి మరియు శివ లకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు.
