సత్యనారాయణపురం: ఎన్టీఆర్ జిల్లాలోని ఐసీటీసీ, ఏఆర్టీ, స్వచ్చంద సంస్ధల సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్ధేశించిన లక్ష్యాలు అందుకోవాలని ఏఆర్టీసెంటర్ వైద్యాధికారి డాక్టర్ వీర్నాల గౌతం అంబేడ్కర్ సూచించారు. స్ధానిక పాత ప్రభుత్వాసుపత్రి ఏఆర్టీ సెంటర్లో సోమవారం ఏఆర్టీసెంటర్, ఐసీటీసీ, స్వచ్చంద సంస్ధల ప్రతినిధుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి వారు తమకు నిర్ధేశించిన లక్ష్యాలు అందుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. అలాగే హెచ్ఐవి సోకిన వారిని త్వరితగతిన గుర్తించటంతో పాటు హెచ్ఐవి సోకిన వారికి ఏఆర్టీ చికిత్సను అందేలా చూడాలని సూచించారు.
అలాగే హైరిస్కు వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. హెచ్ఐవి సోకిన ప్రతీ ఒక్కరూ ఏఆర్టీ చికిత్సను సక్రమంగా వాడేలా చూడాలని అన్నారు. అలాగే ప్రభుత్వ పధకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ అందేలా పనిచేయాలని అన్నారు. జిల్లాలోని సిబ్బంది సమన్వయంతో పనిచేసి టార్గెట్లను పూర్తిచేయాలని సూచించారు. ఇందుకుగానూ అవసరమైన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని అన్నారు. అనంతరం నిర్ధేశించిన టార్గెట్ల వారీగా సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో వైధ్యాధికారి డాక్టర్ చిత్ర, డాక్టర్ శ్రీదేవి, కౌన్సిలర్ కనకాల వరప్రసాద్, ఎం భాస్కరరావు, ఎం సౌజన్య, లక్ష్మణరావు, షేర్ ఇండియా సంస్ధ సిబ్బంది జాన్ వెస్లీ, జిల్లాలోని వాసవ్యమహిళా మండలి, రైడ్స్, విహాన్ తదితర స్వచ్చంద సంస్ధల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
