కరెంటు పోతే వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి

Gottipati ravi

విద్యుత్ సమస్యల తక్షణ పరిష్కారానికి, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు 1912 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో తెస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా ఉద్దేశపూర్వక విద్యుత్ కోతలు లేవని, వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పుల వల్లే కొన్నిచోట్ల సాంకేతిక అంతరాయాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పగటిపూట 45 డిగ్రీలకు పైగా నమోదు అవుతుందా రికార్డులు స్థాయి ఉష్ణోగ్రతలు సాయంత్రం వేళల్లో వీస్తున్న ఈదురుగాలి కారణంగానే పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఎదురవుతున్నాయని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తీవ్రమైన ఎండలు ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉన్న విపరీతమైన వేడి వల్ల సరఫరా సమస్యలు వస్తున్నాయని ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే దాని స్థానంలో యుద్ధ ప్రాతిపదికన కొత్తది ఏర్పాటు చేసి విద్యుత్తును పునరుద్ధరించడానికి కనీసం రెండు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది అని ఆయన వివరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ విద్యుత్ శాఖ సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని కొనియాడారు ఇటీవల సత్తెనపల్లిలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తూ ఇద్దరు సిబ్బంది ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఉదంతాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.