ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ పాసవ్వాల్సిందే
అర్హత గడువు రెండేళ్ల నుంచి మూడేళ్లకు పొడిగింపు
టెట్ రివ్యూ పిటిషన్స్ను సుప్రీం కోర్ట్ కొట్టేసింది. ప్రభుత్వ టీచర్లు అంతా టెట్ రాసి నిర్ణీత సమయంలో అర్హత సాధించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందు నియమితులై, ఇంకా ఐదేళ్లకుపైగా సర్వీస్ ఉన్న టీచర్లు రెండేళ్లలోపు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని 2025 సెప్టెంబరు 1న తాను ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వివిధ ఉపాధ్యాయ సంఘాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది.
అయితే టెట్ అర్హత సాధించడానికి వారికి ఇదివరకు ఇచ్చిన రెండేళ్ల గడువును మూడేళ్లకు పెంచింది. అంటే ఇదివరకు 2027 ఆగస్టు 31 వరకు విధించిన గడువును ఇప్పుడు 2028 ఆగస్టు 31కి పొడిగించింది. ఈ ఒక్క ఉపశమనం మినహా పాత తీర్పు అంతా యథావిధిగా అమలులో ఉంటుందని జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఇచ్చిన తీర్పులో పేర్కొంది.
