హోర్ముజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తతలు 

Harmuz

అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణ

పశ్చిమాసియా ప్రాంతంలోని  పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. హోర్ముజ్ జలసంధి వైపు ఇరాన్ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను అమెరికా సైన్యం కూల్చేసినట్లు  ప్రకటించింది.   ప్రతిస్పందనగా ఇరాన్ తీర ప్రాంతాల్లో ఉన్న నిఘా రాడార్ కేంద్రాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఈ పరిణామాల వలన  కాల్పుల విరమణ ఒప్పందాన్ని   ప్రమాదంలో పడేశాయి.

అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, ఇరాన్ పంపిన డ్రోన్లు ప్రాంతీయ సముద్ర రవాణాకు  ముప్పుగా మారాయి. అందువల్ల వాటిని అడ్డుకోవడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని దాడులు జరగకుండా ఇరాన్ రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది.ప్రపంచ చమురు రవాణాలో   కీలకమైన మార్గమైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ఆందోళన నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా రవాణా అవుతున్న చమురు, సహజ వాయువులో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. దీంతో చమురు ధరలు పెరుగుతుండగా, అమెరికాలోనూ రాజకీయ ప్రభావం కనిపిస్తోంది.

ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణను పొడిగించేందుకు, అలాగే ఇరాన్ అణు కార్యక్రమంపై కొత్త చర్చలు ప్రారంభించేందుకు ఒక తాత్కాలిక అవగాహన కుదిరింది. అయితే ఆ ఒప్పందంలో కొన్ని మార్పులు అవసరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించగా, ఇరాన్ ఇప్పటివరకు బహిరంగంగా అంగీకారం తెలపలేదు.

ఈ పరిస్థితుల మధ్య ట్రంప్ మాత్రం పరిస్థితి సానుకూలంగానే ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరినా, లేకపోయినా  కఠిన చర్యల ద్వారానైనా సమస్యను పరిష్కరిస్తామన్నారు . చర్చలు ఆలస్యం కావడానికి ఇరాన్ స్వతంత్ర వైఖరి, జాతీయ గౌరవ భావన కూడా కారణమన్నారు.

ఇదిలా ఉండగా, లెబనాన్‌లో  పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో పలు ప్రాంతాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పలువురు మరణించినట్లు తెలుస్తోంది.  అమెరికా మధ్యవర్తిత్వం వలన  లెబనాన్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ మధ్య కొత్త కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఇరాన్ మద్దతుతో ఉన్న హిజ్బుల్లా దానిని తిరస్కరించింది.

అమెరికా మరోవైపు ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని కూడా పెంచుతోంది. ఇరాన్‌కు సంబంధించిన చమురు ట్యాంకర్‌ను హిందూ మహాసముద్రంలో స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అదనంగా ఇరాన్ ఇంధన రంగానికి సంబంధించిన వ్యక్తులు, సంస్థలు, నౌకలపై కొత్త ఆంక్షలను విధించింది.

 హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన భద్రతకు గుండెకాయ లాంటిది . ఈ ప్రాంతంలో చిన్న ఘర్షణ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది . ప్రస్తుతం అమెరికా–ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం లేకపోయినా, డ్రోన్ దాడులు, ప్రతిదాడులు, ఆంక్షలు, సముద్ర నిర్బంధ చర్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.

కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందా? లేక మరోసారి పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగుతాయా? అనే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. మధ్యప్రాచ్య శాంతి, ప్రపంచ ఇంధన మార్కెట్ల స్థిరత్వం, అంతర్జాతీయ వాణిజ్య భవిష్యత్తు – ఇవన్నీ రాబోయే రోజుల్లో అమెరికా, ఇరాన్ తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉన్నాయి.