అక్టోబర్‌లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్

Kona dsc

 

డిఎస్సీ ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు లేవు పూర్తి పారదర్శకతతోనే నియామక ప్రక్రియ నిర్వహించాం

రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్

 

రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు  ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా అక్టోబర్ లో మెగా  డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు, డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు  రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. గురువారం  రాష్ట్ర సచివాలయం  ప్రచార విభాగంలో  రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  అజయ్ జైన్, శాప్ వైస్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ భరణితో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. డిఎస్సీ-2025 నియామకాలపై మరొక సారి సమగ్ర వివరణ ఇచ్చారు.  డీఎస్సీ-2025 నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్లు, స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా అమలుపై కొంత మంది అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. 

2024లో నోటిఫై చేసిన పోస్టులను భర్తీ చేయకపోవడానికి కారణం 

2024లో నోటిఫై చేసిన సుమారు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్  తెలిపారు.  సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు హారిజాంటల్ రిజర్వేషన్ల అమలులో పూర్తి చట్టబద్ధత, స్పష్టత, నిబంధనల అనుసరణను నిర్ధారించాల్సిన అవసరం ఏర్పడటంతో పాటు, టెట్–డీఎస్సీ ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించి అభ్యర్థులకు ఎటువంటి గందరగోళం లేకుండా పరిపాలనా సౌలభ్యాన్ని కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ రెండు అంశాల నేపథ్యంలో నియామక ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి రావడంతో పోస్టుల భర్తీ ఆలస్యమైనట్లు ఆయన స్పష్టం చేశారు. 

డిఎస్సీ ప్రక్రియలో పేపర్ లీకేజీకి అవకాశమే లేదు

డిఎస్సీ నియామక ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించారని   కోన శశిధర్  తెలిపారు.  సిస్టమ్‌కు పరిమిత సంఖ్యలో మాత్రమే అధికారిక యాక్సెస్ ఉంటుందని, కేవలం ఇద్దరు నియమిత శాశ్వత ఉద్యోగులు మాత్రమే డేటా అప్‌లోడ్ చేసే అధికారం కలిగి ఉంటారని తెలిపారు. పాస్‌వర్డులు నిరంతరం మార్చబడుతూ ఉంటాయని, అనధికార ప్రవేశానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. అందువల్ల డేటా లీకేజీ లేదా పేపర్ లీకేజీకి ఎటు వంటి అవకాశం ఉందన్నారు. 

డిఎస్సీ ఎంపికల్లో టెట్ మార్కులకు 20 శాతం, డిఎస్సీ మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి జనరల్ మెరిట్ లిస్ట్ రూపొందించినట్లు ఆయన తెలిపారు. టెట్ మార్కులను ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.  సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కాల్ లెటర్ రావడం అంటే అభ్యర్థి ఎంపికైనట్లుగా కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. 

స్పోర్ట్స్ కోటా నియామకాలపై పూర్తి వివరణ  

స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో ప్రభుత్వం అమలులో ఉన్న నిబంధనలు, జీఓల ప్రకారం పూర్తిస్థాయి పారదర్శకతతో ఎంపికలు నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  అజయ్ జైన్ స్పష్టం చేశారు. 

382 మంది స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల వివరాలు ఆన్‌లైన్‌లోనే ఉన్నాయి

డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 382 మంది అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలో భాగమయ్యారని ఆయన తెలిపారు. వీరిలో 22 మంది బంగారు పతక విజేతలు, 40 మంది రజత పతక విజేతలు, 43 మంది కాంస్య పతక విజేతలు మరియు 275 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఉన్నారని తెలిపారు.  ఖో-ఖో, బాల్ బ్యాడ్మింటన్, జూడో, సాప్టుబాల్, అథ్లెటిక్స్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, హాకీ తదితర 34 క్రీడా విభాగాలకు చెందిన క్రీడాకారులు ఈ ఎంపికల్లో భాగమయ్యారని ఆయన తెలిపారు. 

ప్రతి సర్టిఫికేట్‌పై బహుస్థాయి ధ్రువీకరణ 

సమర్పించిన ప్రతి క్రీడా సర్టిఫికేట్‌ను స్క్రూటినీ కమిటీ, రాష్ట్ర స్థాయి కమిటీ, సంబంధిత క్రీడా సంఘాలు, యూనివర్సిటీలు మరియు ఇతర అధికారిక రికార్డుల ద్వారా పరిశీలించి మాత్రమే అర్హత నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 1996 నుంచి 2025 వరకు జారీ చేసిన సర్టిఫికెట్లను కూడా ధృవీకరణలో భాగంగా పరిశీలించినట్లు వెల్లడించారు. 

దుర్గయ్య కేసుపై ..

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థి అనిగి దుర్గయ్య తనకు జాతీయ క్రీడల్లో సాధించిన విజయాలున్నప్పటికీ ఉద్యోగం రాలేదని చేసిన ఆరోపణలపై  ఆయన వివరణ ఇస్తూ  దుర్గయ్య 32వ నేషనల్ గేమ్స్ కు సంబంధించిన సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేయలేదని, భౌతిక ధృవీకరణ సమయంలో మాత్రమే ఆ వివరాలను సమర్పించినట్లు తెలిపారు.   అయితే జీఓ-4 మరియు నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశిత గడువులో ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టమైన నిబంధన ఉన్నందున, అనంతరం సమర్పించిన పత్రాలను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యపడలేదని ఆయన పేర్కొన్నారు.  అభ్యర్థి ఆన్‌లైన్‌లో సరైన సర్టిఫికేట్‌ను సమర్పించి ఉంటే, అతని అర్హతను సంబంధిత ప్రాధాన్యత క్రమంలో పరిశీలించే అవకాశం ఉండేదని వివరించారు.  సమావేశంలో రాష్ట్ర విద్యా శాఖ కమినషర్  తమీమ్  అన్సారియా పాల్గొన్నారు.