ఒక తండ్రి నిశ్శబ్ద వేదన
వృద్ధాప్యం అంటే కేవలం ముడతలు పడిన చర్మం, వణికే చేతులు మాత్రమే కాదు; అది మనసులో ఒక తోడు, ఆత్మీయ పలకరింపు కోసం ఆరాటపడే సున్నితమైన మజిలీ. ఆధునిక యాంత్రిక జీవనంలో తల్లిదండ్రులకు కావాల్సింది బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యే డాలర్లు కాదు, తమ పిల్లల నోట వచ్చే ‘బాగున్నావా నాన్నా’ అనే ఐదు నిమిషాల సమయం..
ఒక వీడ్కోలు.. ఒక శూన్యం
హైదరాబాద్ నగరపు ఒక వీధిలోని చిన్న అద్దె ఇల్లు. ఒకప్పుడు ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టి వేలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన రామారావు , తన జీవితపు ఆఖరి మజిలీలో ఒంటరివాడైపోయాడు. కొడుకు విదేశాల్లో సాఫ్ట్వేర్ దిగ్గజం, కూతురు మరో దేశంలో సేవారంగంలో బిజీ. సమాజం దృష్టిలో ఆయన అదృష్టవంతుడైన తండ్రి, కానీ ఆయన అంతరంగంలో మాత్రం అనాథ. ప్రతి ఆదివారం ఆయన ఫోన్ చేసేవాడు. కానీ అవతలి వైపు నుంచి వచ్చే సమాధానం ఎప్పుడూ ఒకటే:బిజీగా ఉన్నాం నాన్నా, తర్వాత మాట్లాడుదాం.. కానీ ఆ ‘తర్వాత’ అనే సమయం కాలగర్భంలో కలిసిపోయింది తప్ప, ఎన్నడూ రాలేదు.
చెల్లించబడింది.. ముగింపు పత్రం
రామారావు ఆరోగ్యం క్రమేణా క్షీణించింది. వారానికి రెండుసార్లు డయాలసిస్ బెడ్‌పై గడపాల్సి వచ్చేది. వైద్యులు కిడ్నీ మార్పిడి ప్రస్తావన తెచ్చినప్పుడు, ఆయన పెదవులపై ఒక చేదు నవ్వు మెరిసింది. ‘నాతో మాట్లాడడానికే సమయం లేని నా పిల్లలు, నా కోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా?’ అని సరిపెట్టుకున్నాడు. అక్కడే ఆయన ఒక కఠినమైన, బాధాకరమైన నిర్ణయానికి వచ్చాడు. తన మరణానికి తానే ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టాడు:
- * చివరి శ్వాస విడిచాక అలంకరించడానికి తనదో నవ్వుతున్న ఫోటోను సిద్ధం చేసుకున్నాడు.
- * అంతిమ సంస్కారాల ఖర్చులను ముందే అమర్చాడు.
- * పిల్లల కోసం చివరి లేఖలు రాసి కవరులో పెట్టాడు.
- ఆ లేఖల కింద ఆయన రాసిన ఒకే ఒక్క మాట.. ‘చెల్లించబడింది’
అది కేవలం డబ్బో, ఖర్చో కాదు. అది ఆయన పెట్టుకున్న ఆశలకు, పడ్డ ఎదురుచూపులకు, అనుభవించిన నిరాశకు ఆయన రాసుకున్న ముగింపు పత్రం.
ఆఖరి పిలుపు
పరిస్థితి విషమించినప్పుడు ఆసుపత్రి నుంచి అతని పిల్లలకు ఫోన్లు వెళ్లాయి. అక్కడి నుంచి వచ్చిన సమాధానాలు హృదయాన్ని ముక్కలు చేశాయి. ‘ఇప్పుడే రావడం కుదరదు, ఎంతైనా డబ్బు పంపిస్తాం’ అని. ఒక తండ్రి ప్రాణం పోతుంటే వారికి కనిపించింది కేవలం ‘డబ్బు’ మాత్రమే, తండ్రి చేతిని పట్టుకునే ‘ఆప్యాయత’ కాదు.
ఆ రాత్రి రామారావు కన్ను మూశాడు. ఆ కళ్లల్లో పిల్లలు వస్తారనే ఆశ లేదు, కేవలం ఒక ప్రశాంతత ఉంది. వారాల తర్వాత వచ్చిన పిల్లలకు ఇల్లు శూన్యంగా కనిపించింది. అక్కడ వారికి దొరికింది తండ్రి రాసిన ఆఖరి ఉత్తరం మాత్రమే. అందులో ఎలాంటి కోపం లేదు, శాపనార్థాలు లేవు. కేవలం ఒక నిశ్శబ్ద ఆవేదన మాత్రమే ఉంది.
‘నాతో గడపడానికి మీకు సమయం దొరకలేదు. అందుకే, మిమ్మల్ని ఇక ఇబ్బంది పెట్టకూడదని నేను మీ కోసం ఎదురుచూడటం ఆపేసి వెళ్లిపోతున్నాను’
ఐదు నిముషాల టైం లేదా
ఈ రోజుల్లో సాంకేతికత పెరిగి ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చింది. కానీ, పక్కనే ఉన్న మనసులను దూరం చేసింది. రోజుకు వందల వాట్సాప్ మెసేజ్‌లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసే మనకు, కన్నవారిని పలకరించడానికి ఐదు నిమిషాలు దొరకడం లేదా?
ధర లేని త్యాగం: తల్లిదండ్రులు మనల్ని ఈ స్థాయికి తేవడానికి వారి జీవితాలనే త్యాగం చేశారు. వారి ప్రేమకు ఏ కరెన్సీతోనూ విలువ కట్టలేము.
సమయమే అమృతం: వాళ్లకు వృద్ధాప్యంలో కావాల్సింది ఖరీదైన వస్తువులు కాదు, కేవలం మేమున్నాం అనే భరోసా.
ఒక్క నిమిషం ఆలోచించండి
ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న కన్నవారి ఫోన్ నంబర్, రేపు శాశ్వతంగా ‘అందుబాటులో లేని నెంబర్ గా మారిపోవచ్చు. అప్పుడు మీరు ఎంత ఏడ్చినా, ఎంత సంపాదించినా… ఒక్కసారి ‘నాన్నా’ అని పిలిచినా తిరిగి పలికే ప్రాణం ఉండదు. ఉన్నప్పుడే తల్లిదండ్రులను ప్రేమించండి, వారి సమయాన్ని పంచుకోండి. ఎందుకంటే మళ్లీ పుడతామా ఏంటి .
