విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ క్యూలో నిలబడి ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారి పాస్‌పోర్ట్‌లను గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. కొందరి పాస్‌పోర్ట్‌లు నీలం రంగులో ఉంటే, మరికొందరివి ఎరుపు, ఆకుపచ్చ లేదా నలుపు రంగులో ఉంటాయి. ఈ రంగుల వైవిధ్యం అందం కోసం మాత్రమేనా ? లేక వాటి వెనుక ఏదైనా ప్రత్యేకమైన అర్థం ఉందా? అనే ప్రశ్న చాలామందికి కలుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌లకు ప్రధానంగా నాలుగు రంగులే ఉపయోగిస్తున్నారు. అవి నీలం, ఎరుపు, ఆకుపచ్చ, నలుపు. అయితే ఈ రంగుల ఎంపిక వెనుక అంతర్జాతీయ చట్టం కంటే చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, భౌగోళిక గుర్తింపులు ఇలాకా పాత్ర పోషిస్తాయి.
ప్రపంచ దేశాల పాస్‌పోర్ట్‌ల రూపకల్పనకు సంబంధించిన కొన్ని ప్రమాణాలను అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిర్దేశిస్తుంది. పాస్‌పోర్ట్ పరిమాణం, మెషిన్-రీడబుల్ జోన్, భద్రతా లక్షణాలు వంటి అంశాలపై నియమాలు ఉన్నాయి . పాస్‌పోర్ట్ కవర్ ఏ రంగులో ఉండాలనే విషయంపై అంతర్జాతీయ నిబంధన లేదు. ప్రతి దేశం తన చరిత్ర, సంప్రదాయం, జాతీయ గుర్తింపు లేదా రాజకీయ అవసరాలకు అనుగుణంగా రంగును ఎంచుకునే స్వేచ్ఛను ఉంది. అయినప్పటికీ ఎక్కువ దేశాలు ముదురు రంగులనే ఎంచుకుంటాయి. ఎందుకంటే అవి హుందాగా కనిపించడమే కాకుండా, మరకలు అంటినా , అరిగిపోయిన పెద్దగా పైకి కనిపించవు.
పాస్‌పోర్ట్ రంగుల ఎంపికలో మతం, సంస్కృతి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇస్లామిక్ దేశాలలో ఆకుపచ్చ రంగుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇస్లాంలో ఆకుపచ్చ రంగును శాంతి, ఆశ, స్వర్గానికి ప్రతీకగా భావిస్తారు. అందువల్ల సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇరాన్, బంగ్లాదేశ్ వంటి అనేక ముస్లిం-మెజారిటీ దేశాలు ఆకుపచ్చ రంగు పాస్‌పోర్ట్‌లను ఉపయోగిస్తున్నాయి. ఆఫ్రికాలోని కొన్ని దేశాలు కూడా ప్రకృతి, భూమి, అభివృద్ధికి చిహ్నంగా ఆకుపచ్చ రంగును స్వీకరించాయి.
రాజకీయ చరిత్ర కూడా పాస్‌పోర్ట్ రంగులను ప్రభావితం చేసింది. యూరోపియన్ యూనియన్‌లోని చాలా దేశాలు బర్గండీ లేదా ఎరుపు రంగు పాస్‌పోర్ట్‌లను ఉపయోగిస్తున్నాయి. ఇది వారి ఐక్యతకు ప్రతీకగా మారింది. మరోవైపు చైనా, రష్యా వంటి కమ్యూనిస్టు లేదా మాజీ కమ్యూనిస్టు దేశాలు కూడా ఎరుపు రంగును ఎంచుకున్నాయి. కమ్యూనిస్టు ఉద్యమాలతో ఎరుపు రంగుకు ఉన్న చారిత్రక అనుబంధం ఇందుకు కారణం.
నీలం రంగు పాస్‌పోర్ట్‌లకు కూడా ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, భారతదేశం వంటి అనేక దేశాలు నీలం రంగును ఉపయోగిస్తున్నాయి. చరిత్రలో యూరోపియన్ వలస పాలన నుంచి స్వాతంత్రం పొందిన దేశాలు తమ ప్రత్యేక గుర్తింపును చాటుకోవడానికి నీలం రంగును స్వీకరించాయి. కరేబియన్ ప్రాంతంలోని కొన్ని దేశాలు సముద్రంతో తమకున్న అనుబంధాన్ని సూచించేందుకు కూడా నీలి రంగును ఎంచుకున్నాయి.
నలుపు రంగు పాస్‌పోర్ట్‌లు ప్రపంచంలో అత్యంత అరుదుగా కనిపిస్తాయి. న్యూజిలాండ్, అంగోలా, మలావి వంటి కొద్ది దేశాలు మాత్రమే ఈ రంగును ఉపయోగిస్తున్నాయి. ముఖ్యంగా న్యూజిలాండ్‌లో నలుపు జాతీయ రంగుగా గుర్తింపు పొందింది. అందుకే ఆ దేశ పాస్‌పోర్ట్ నలుపు రంగులో ఉంటుంది. నలుపు రంగు అధికారాన్ని, గంభీరతను ప్రతిబింబిస్తుందని భావిస్తారు.
ఈ విషయంలో భారతదేశం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. సాధారణ పౌరులకు నీలం రంగు పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. అధికారిక విధులపై విదేశాలకు వెళ్లే ప్రభుత్వ అధికారులకు తెలుపు రంగు పాస్‌పోర్ట్, దౌత్యవేత్తలకు మెరూన్ రంగు పాస్‌పోర్ట్ అందజేస్తారు. గతంలో విదేశీ ఉపాధి కోసం వెళ్లే కొన్ని వర్గాల కోసం ఆరెంజ్ రంగు పాస్‌పోర్ట్ ప్రతిపాదన వచ్చింది. ఇలా నాలుగు రకాల పాస్‌పోర్ట్‌లను వేర్వేరు అవసరాలకు అనుగుణంగా ఉపయోగించిన దేశంగా భారత్ ప్రత్యేకతను సంతరించుకుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇ-పాస్‌పోర్ట్‌ల యుగం ప్రారంభమవుతోంది. బయోమెట్రిక్ చిప్‌లు, డిజిటల్ గుర్తింపు వివరాలతో కూడిన ఈ పాస్‌పోర్ట్‌లు భవిష్యత్తులో ప్రయాణాన్ని వేగవంతంగా, సురక్షితంగా మార్చనున్నాయి. అయినప్పటికీ పాస్‌పోర్ట్ రంగులు తమ ప్రత్యేక గుర్తింపును కోల్పోవు. ఎందుకంటే అవి కేవలం ఒక పత్రం కవర్ రంగు మాత్రమే కాదు. ఒక దేశం యొక్క చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, మత విశ్వాసాలు, జాతీయ గుర్తింపును ప్రతిబింబించే చిహ్నాలు.
