దేవుడికి వినతి
ANANTAPURAM: ‘స్వామి మా అత్త చనిపోయాలా చూడు’ అని కోడలు దేవుడికే విన్నవించింది. ఇది అనంతపురం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీలో కానుకలు లెక్కిస్తున్నప్పుడు వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని దేవుడిని ప్రార్థిస్తూ హుండీలో కానుకలు వేయడం, కొందరు తమ మనసులోని బాధలను కాగితాలపై రాసి సమర్పించడం తరచూ కనిపిస్తుంటుంది. అయితే ఈసారి హుండీలో లభించిన ఓ రూ.20 నోటుపై రాసిన సందేశం ఆలయ అధికారులు, భక్తులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.
కానుకలు లెక్కిస్తున్న సమయంలో ఓ రూ.20 నోటుపై ‘స్వామీ… మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఆమె త్వరగా చనిపోయేలా చూడు’ అని రాసి ఉండటం కనిపించింది. దీన్ని చూసిన సిబ్బంది విస్మయానికి గురికాగా, అక్కడున్న భక్తులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా ఆరోగ్యం, ఉద్యోగం, విద్య, వివాహం, సంతానం వంటి కోరికలతో దేవుడిని వేడుకునే భక్తులు కనిపిస్తుంటారు. కానీ ఒకరి మరణాన్ని కోరుతూ హుండీలో మొరపెట్టుకోవడం అరుదైన ఘటనగా నిలిచింది. ఈ సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
కుటుంబ కలహాలు ఎంత తీవ్రమైన స్థాయికి చేరితే ఇలాంటి రిక్వెస్ట్ చేస్తారో అర్థమవుతోందని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, సమస్యలకు పరిష్కారం కోరడం బదులు ఒకరి ప్రాణాలు తీయాలని దేవుడిని వేడుకోవడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ మహిళ ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుందో తెలియదని, ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా విస్మరించరాదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ‘రూ.20 నోటుతో అత్తపై ఫిర్యాదు పెట్టేసింది’, ‘ఇరవై రూపాయలకే అత్తను లేపేయమని కోరింది’, ‘ఇలాంటి కోరికను దేవుడు కూడా ఊహించి ఉండడు’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటన హాస్యంగా కనిపించినా, కుటుంబాల్లో పెరుగుతున్న విభేదాలు, మానసిక ఒత్తిడులు ఎంతటి తీవ్ర స్థాయికి చేరుతున్నాయో చెప్పే ఉదాహరణగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
