యువతపై కత్తెరతో దాడి
పెందుర్తిలో యువతపై కత్తెరతో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. తుని ప్రాంతవాసి లక్ష్మి ఉద్యోగం కోసం విశాఖకు వచ్చింది. అప్పుడు పాయకరావుపేటకు చెందిన చంద్రసాయి జాబ్ పేరిట ఆమెను పరిచయం చేసుకున్నాడు. అయితే అప్పటికే అతడి పై పోక్సో కేసు నమోదు అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి అతనికి దూరంగా ఉంది. అయినా చంద్ర సాయి ఆమె వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా కుటుంబ సభ్యుల సమక్షంలో లక్ష్మి జోలికి రానంటూ చంద్రసాయి క్షమాపణలు చెప్పాడు.
ఇదిలా ఉంటే గతంలో నమోదైన పోక్సో కేసుకు సంబంధించిన వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో మాట్లాడదాం రా అంటూ చంద్రసాయి.. లక్ష్మిని పెందుర్తి సమీపం దుగ్గ వానిపాలెంలోనే తన ఇంటికి పిలిచాడు. పోక్సో కేసు కు సంబంధించిన విషయాలపై యువతితో చంద్రసాయి ఘర్షణ పడ్డాడు ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన అతను ఆమెను గదిలోకి తీసుకెళ్లి కత్తెరతో మెడపై దాడి చేసినట్టు బాధితురాలు చెబుతోంది.
ఆమె కేకలు విన్న స్థానికులు వెంటనే బాధితురాలిని కేజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పూర్తి కారణాలతోపాటు నిందితుడి చంద్రసాయి పాత్ర పై విచారణ కొనసాగుతోంది.
