ప్రజారోగ్య రక్షణకు కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) మందులపై కేంద్ర ప్రభుత్వం తక్షణ ప్రభావంతో నిషేధం విధించింది. ఈ ఔషధాల వల్ల రోగులకు అదనపు వైద్య ప్రయోజనాలు లేవని, పైగా ఆరోగ్యపరమైన ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని నిపుణుల సమీక్షలో తేలడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940లోని సెక్షన్ 26ఏ ప్రకారం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధ పదార్థాలను ఒకే మాత్ర లేదా సిరప్ రూపంలో కలిపి తయారు చేసే మందులను ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) మందులుగా పరిగణిస్తారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మార్కెట్లో ఉన్న వివిధ కాంబినేషన్ మందులను సమీక్షించింది. శాస్త్రీయ ఆధారాలు, వైద్యపరమైన సమర్థన లేని 16 కాంబినేషన్లు ప్రజారోగ్యానికి హానికరమని గుర్తించి వాటిని నిషేధించాలని సిఫారసు చేసింది.
నిషేధిత జాబితాలో అమోక్సిసిలిన్-సెర్రాటియోపెప్టిడేస్, అమోక్సిసిలిన్-సెర్రాటియోపెప్టిడేస్-లాక్టోబాసిల్లస్ స్పోరోజెనస్, సెఫురోక్సిమ్-సెర్రాటియోపెప్టిడేస్ వంటి యాంటీబయాటిక్ కాంబినేషన్లతో పాటు కొన్ని నొప్పి నివారణ, జీర్ణకోశ సంబంధిత ఔషధాలు కూడా ఉన్నాయి. అలాగే కలబంద, విటమిన్-ఈ, జోజోబా ఆయిల్, టీ ట్రీ ఆయిల్ తదితర పదార్థాల మిశ్రమాలతో తయారయ్యే కొన్ని చర్మ సంరక్షణ లోషన్లు, క్రీములు కూడా నిషేధిత జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ప్రజలకు సురక్షితమైన, శాస్త్రీయంగా నిరూపితమైన ఔషధాలే అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. నిషేధిత మందుల తయారీ, విక్రయాలు, పంపిణీ, దిగుమతులను వెంటనే నిలిపివేయాలని ఔషధ తయారీ సంస్థలు, దిగుమతిదారులు, డిస్ట్రిబ్యూటర్లను ఆదేశించింది. అలాగే రాష్ట్రాల డ్రగ్ కంట్రోల్ విభాగాలు ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.
