– గ్రీస్‌లోని మౌంట్ అథోస్ ఆశ్రమం వెనుక ఆశ్చర్యకరమైన కథ
ఒక్క మహిళను కూడా చూడకుండా ఒక వ్యక్తి జీవితాంతం గడిపాడంటే ఎవరూ నమ్మరు . ఈరోజు అది అసాధ్యం కూడా . చారిత్రక కథనాల ప్రకారం మిహైలో టొలోటోస్ (Mihailo Tolotos) అనే సన్యాసి తన 82 ఏళ్ల జీవితంలో ఒక్కసారి కూడా మహిళను చూడలేదట . దీనికి కారణం గ్రీస్‌లోని మౌంట్ అథోస్ (Mount Athos) అనే ప్రత్యేక సన్యాస ప్రాంతమే.
ఇంతకు మౌంట్ అథోస్ అంటే ఏమిటి?
గ్రీస్‌లో ఉన్న మౌంట్ అథోస్ ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోడాక్స్ క్రైస్తవ సన్యాస కేంద్రం. ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన మఠాల సముదాయం. ఇక్కడ వెయ్యేళ్లకు పైగా అమల్లో ఉన్న ‘అవాటోన్ (Avaton)’ అనే నియమం ప్రకారం మహిళలకు ప్రవేశం పూర్తిగా నిషేధం. ఈ నిషేధం సాధారణ మహిళలకే కాదు, చాలా వరకు ఆడ జంతువులకూ వర్తిస్తుంది. ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక సంరక్షకురాలిగా వర్జిన్ మేరీని మాత్రమే భావిస్తారు.
మిహైలో టొలోటోస్ జీవితం
మిహైలో టొలోటోస్ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఆయన పుట్టిన కొద్దిసేపటికే తల్లి మరణించడంతో మఠంలోని సన్యాసులు అతన్ని మౌంట్ అథోస్కు తీసుకెళ్లి పెంచారు. ఆ తర్వాత ఆయన జీవితమంతా అక్కడే గడిచింది. బయట ప్రపంచం అతనికి పూర్తిగా తెలీదు కూడా . మహిళలను ఎప్పుడూ చూడలేదు. ఆయన రోజువారీ జీవితం ప్రార్థనలు, ధ్యానం, వ్యవసాయ పనులు, మఠ నియమాలతోనే సాగింది.
ఆయనకు ఎప్పుడైనా ఆసక్తి కలిగిందా?
చరిత్రలో ఎక్కడా మిహైలో టొలోటోస్ మహిళలను చూడాలనే కోరిక వ్యక్తం చేశారని ఆధారాలు లేవు. ఆయనతో కలిసి జీవించిన సన్యాసులు ఆయనను ప్రశాంత స్వభావం కలిగిన, భక్తిపరుడైన వ్యక్తిగా వర్ణించారు. సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచే ఒకే వాతావరణంలో పెరిగితే, మరో ప్రపంచం ఉందన్న విషయం తెలీదు కూడా దాంతో ఆ ప్రపంచాన్ని చూడలేదు అన్న దిగులు కూడా ఉండదు.
ఎందుకు అంత ఇంటరెస్టింగ్ అంటే ప్రస్తుత ప్రపంచంలో మహిళలు ప్రతి రంగంలో కనిపిస్తున్న సమయంలో జీవితాంతం ఒక్క మహిళను కూడా చూడని వ్యక్తి కథ చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది . అదే సమయంలో వ్యక్తిగత ఎంపిక, మత సంప్రదాయాలు, సామాజిక వేరుపాటు వంటి అంశాలపై కూడా చర్చకు దారితీస్తోంది.
