అమెరికాలో కొత్త డాలర్ నోట్లు

Dollar

ట్రంప్ సంతకంపై చర్చ..

అమెరికా స్వతంత్ర దేశమై  250 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ దేశం ప్రత్యేక డాలర్ కరెన్సీ నోట్లను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నోట్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం ఉండనున్నట్లు అమెరికా ట్రెజరీ శాఖ ప్రకటించింది.

సాధారణంగా అమెరికా కరెన్సీ నోట్లపై ట్రెజరీ సెక్రటరీ, యూఎస్ ట్రెజరర్ సంతకాలు మాత్రమే ఉంటాయి. కానీ 250వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈసారి ట్రంప్ సంతకంతో ప్రత్యేక నోట్లను విడుదల చేస్తున్నట్లు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తెలిపారు. ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్న 100 డాలర్ల నోటు నమూనాను ఆయన రీపోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఈ నిర్ణయం అమెరికాలో రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చకు దారితీసింది. అమెరికా కరెన్సీపై దేశాధినేత పేరు లేదా సంతకం ముద్రించడం సంప్రదాయంలో లేదు. దీంతో ఇది సుదీర్ఘ సంప్రదాయానికి విరుద్ధమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో కూడా ట్రంప్ పేరును కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, సంస్థలకు అనుసంధానించే ప్రయత్నాలు వివాదాస్పదమయ్యాయి. కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు కూడా వాటిని వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ సంతకంతో విడుదల కానున్న డాలర్ నోట్లపై అమెరికాలో విస్తృత చర్చ కొనసాగుతోంది.