కాకినాడ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ
kakinada: నగరంలోని 12వ డివిజన్ పరిధిలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే కాలనీలో ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ తెలిపారు.
మంగళవారం ఉదయం కమిషనర్ మహాత్మ జ్యోతిరావు పూలే కాలనీలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తాగునీటి కొరత, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, వీధి దీపాలు సక్రమంగా వెలగకపోవడం వంటి సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.
డివిజన్ ఇన్చార్జి తుమ్మల రమేష్ మాట్లాడుతూ, పూలే కాలనీలో నూతనంగా నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరాన్ని కమిషనర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ, కాలనీలో ప్రధానంగా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీధి దీపాల సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన టాయిలెట్లను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావడానికి సంబంధిత అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు.
ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, డీఈ లక్ష్మీనారాయణ, ఈఈ అర్జున్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్తిబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
