100 ఏళ్లుగా కనిపించని చేప తొలిసారి సజీవంగా చిత్రీకరణ
అట్లాంటిక్ మహాసముద్రంలో శాస్త్రవేత్తలు చేపట్టిన 35 రోజుల పరిశోధనా యాత్రలో రెండు కీలక ఆవిష్కరణలు జరిగాయి. ఒకటి 100 ఏళ్లుగా శాస్త్రవేత్తలకు తెలిసినా, సహజ నివాసంలో ఎప్పుడూ కనిపించని ‘వింటేరియా టెలిస్కోపా’ అనే అరుదైన బారెల్ఐ చేపను తొలిసారి సజీవంగా చిత్రీకరించడం. రెండోది సముద్ర గర్భంలో ఇప్పటివరకు గుర్తించని రెండు హైడ్రోథర్మల్ వెంట్ (వేడి నీటి ఊటలు) ప్రాంతాలను కనుగొనడం.ఈ పరిశోధనను ష్మిడ్ ఓషన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఫాల్కర్ అనే పరిశోధనా నౌకలో నిర్వహించారు. బ్రెజిల్ ఈశాన్య తీరానికి సుమారు 800 మైళ్ల దూరంలో ఉన్న డోల్డ్రమ్స్ ఫ్రాక్చర్ జోన్లో ఈ పరిశోధనలు జరిగాయి.
అరుదైన బారెల్ఐ చేప
‘వింటేరియా టెలిస్కోపా’ చేపకు పారదర్శక తల, గొట్టంలా ఉండే కళ్లు ప్రత్యేకత. సముద్ర గర్భంలోని చీకటిలో చాలా స్వల్పమైన వెలుతురు, జీవుల నుంచి వచ్చే కాంతిని కూడా ఈ కళ్లు గుర్తించగలవు. ఇప్పటివరకు ఈ చేప గురించి శాస్త్రవేత్తలకు తెలిసిన సమాచారం ఎక్కువగా వలల్లో చిక్కిన మృత నమూనాల ఆధారంగానే ఉండేది. అయితే ఈసారి 710 మీటర్ల లోతులో రిమోట్‌తో పనిచేసే సబ్స్టాస్టియన్ అనే నీటి అడుగు రోబోట్ ఈ చేపను సహజ వాతావరణంలో సజీవంగా చిత్రీకరించింది. పరిశోధనలో మాగ్నాపిన్నా జాతికి చెందిన రెండు అరుదైన స్క్విడ్లను కూడా గుర్తించారు. వీటి చేతులు, టెంటాకిల్స్ సుమారు 8 మీటర్ల వరకు పొడవుగా ఉంటాయి.
సముద్ర గర్భంలో కొత్త వేడి నీటి ఊటలు
శాస్త్రవేత్తలు సముద్ర అడుగుభాగాన్ని అత్యాధునిక సోనార్ సాంకేతికతతో పరిశీలించి రెండు కొత్త హైడ్రోథర్మల్ వెంట్ ప్రాంతాలను గుర్తించారు. వాటిలో ఒక ప్రాంతం 24 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, అక్కడ 23 వెంట్లు ఉన్నాయి. వాటిలో 13 చురుకుగా వేడి నీరు, ఖనిజాలను విడుదల చేస్తున్న ‘బ్లాక్ స్మోకర్’ చిమ్నీలు ఉన్నాయి. ఈ వెంట్లలో నీటి ఉష్ణోగ్రత 280 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైంది.ఈ ప్రాంతాల్లో రొయ్యలు, పీతలు, సముద్ర పుష్పాలు (అనీమోన్స్) వంటి వేలాది జీవులు నివసిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఎందుకు ఈ ఆవిష్కరణ కీలకం?
వెంట్ ప్రాంతాలు సూర్యకాంతి లేకుండానే రసాయన శక్తి ఆధారంగా జీవులు ఎలా జీవిస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా, భూమి వెలుపల కూడా ఇలాంటి పరిస్థితుల్లో జీవం ఉండే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానాలు కనుక్కోవడానికి ఈ పరిశోధనలకు దోహదపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఈ తాజా ఆవిష్కరణలు అట్లాంటిక్ సముద్ర గర్భంలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని మరోసారి నిరూపించాయి.
