లార్డ్స్ లో గెలుపు ఎవరిదో..

E

చెరో మ్యాచ్‌తో సమంగా నిలిచిన భారత్‌, ఇంగ్లాండ్‌

మూడో వన్డే… నరాలు తెగే పోరుకు వేదిక

ఇండియా , ఇంగ్లండ్ ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ ఇప్పుడు తుది  దశకు చేరుకుంది. తొలి మ్యాచ్‌లో భారత్‌ గెలిచింది. రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. ఇక మిగిలింది ఒక్క మ్యాచ్‌. అదే సిరీస్‌ గెలుపోటములను నిర్ణయించనుంది. తొలి రెండు మ్యాచ్‌లు రెండు జట్ల బలాబలాలను బయటపెట్టగా, మూడో వన్డే ఇద్దరికీ కీలకంగా మారింది.

తొలి మ్యాచ్‌లో భారత జట్టు క్రమశిక్షణతో కూడిన ఆటను ప్రదర్శించింది. బ్యాటర్లు పునాది వేయగా, బౌలర్లు ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వకుండా విజయం అందించారు. ఆ గెలుపుతో సిరీస్‌పై భారత్‌ ఆధిపత్యం సాధించినట్లే కనిపించింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.

రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ పూర్తిగా భిన్నమైన జట్టులా కనిపించింది. తొలి మ్యాచ్‌లో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా దూకుడును ఆయుధంగా మార్చుకుంది. భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూనే, బంతితోనూ కట్టుదిట్టమైన ప్రదర్శన చేసింది. ముఖ్యంగా ఒత్తిడి సమయాల్లో వెనక్కి తగ్గకుండా మ్యాచ్‌ను తమవైపు తిప్పుకుంది. ఒక పరాజయం నుంచి ఎంత వేగంగా కోలుకోవచ్చో చూపించింది.

నిర్ణయాత్మక పోరులో..

భారత్‌కు స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. కానీ స్టార్‌డమ్‌ ఒక్కటే మ్యాచ్‌లు గెలిపించదు. కీలక సమయంలో బాధ్యత తీసుకునే ఆటగాళ్లే మ్యాచ్‌ను మలుపు తిప్పుతారు. టాప్‌ ఆర్డర్‌ నిలబడాలి. మధ్య ఓవర్లలో పరుగుల వేగం తగ్గకూడదు. డెత్‌ ఓవర్లలో బౌలర్లు నరాలు బిగించి బంతులు వేయాలి. అప్పుడే విజయం అందుతుంది.

ఇంగ్లాండ్‌ కూడా తక్కువేమీ కాదు. దూకుడే వారి అసలు బలం. మ్యాచ్‌ ఏ దశలో ఉన్నా వెనక్కి తగ్గని స్వభావం వారి ప్రత్యేకత. అవకాశం దొరికితే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో వారు దిట్ట. అందుకే భారత్‌ ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి.

ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఒక విషయం స్పష్టమైంది. ఇరు జట్లు ఒకదానికొకటి గట్టి సవాలు విసురుతున్నాయి. ఒక రోజు భారత్‌ ఆధిపత్యం చెలాయిస్తే, మరుసటి రోజు ఇంగ్లాండ్‌ సత్తా చాటింది . ఇవే మూడో వన్డేపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో టాస్‌, పవర్‌ప్లే, క్యాచ్‌లు, ఫీల్డింగ్‌, డెత్‌ ఓవర్ల బౌలింగ్‌.. ప్రతి చిన్న అంశం సిరీస్‌ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒక్క పొరపాటుతో విజయలక్ష్మి దూరమవుతుంది. ఒక్క అద్భుత ప్రదర్శన చరిత్రను మార్చొచ్చు.