క్యూరియాసిటీ రోవర్ కంటపడిన అరుదైన బహుభుజాకార భూభాగం
14 ఏళ్ల పరిశోధన తర్వాత కూడా మార్స్ విసురుతున్న కొత్త సవాళ్లు
ఒకప్పుడు నీరు, జీవానికి అనుకూల వాతావరణం ఉందా? అనే ప్రశ్నకు కొత్త సంకేతాలు
అంతరిక్ష పరిశోధనల్లో అంగారక గ్రహం ఇప్పటికీ ఆసక్తికరమైన లక్ష్యంగా కొనసాగుతోంది. ప్రతి కొత్త పరిశీలనతో శాస్త్రవేత్తలకు కొత్త ప్రశ్నలను వేస్తున్న మార్స్, తాజాగా మరో రహస్యాన్ని బయటపెట్టింది. సుమారు 14 ఏళ్లుగా అంగారకుడిపై పరిశోధనలు చేస్తున్న నాసా క్యూరియాసిటీ రోవర్, తేనెతుట్టెను తలపించే బహుభుజాకార భౌగోళిక నిర్మాణాలను గుర్తించింది. ఈ ఆవిష్కరణ మార్స్ భౌగోళిక చరిత్రపై మరింత లోతైన అధ్యయనాలకు దారితీసే అవకాశముందని శాస్త్రవేత్తలు అంటున్నారు .
తేనెతుట్టెను తలపించే భూభాగం
గేల్ క్రేటర్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న క్యూరియాసిటీ రోవర్ లేత రంగు రాతి పొరలపై బహుభుజాల ఆకారంలో ఏర్పడిన ఎత్తైన రాతి గీతలను చిత్రీకరించింది. పై నుంచి చూసినప్పుడు తేనెతుట్టె కణాల్లా కనిపించే ఈ నిర్మాణాలు నేలమట్టం నుంచి కూడా అదే ఆకృతిని ఉండటం పరిశోధకులను ఆశ్చర్యానికి గురి చేసింది. రోవర్ ముందుకు కదులుతున్న కొద్దీ ఈ నిర్మాణాలు కాలక్రమంలో కోతకు గురైన ఆనవాళ్లు కూడా కనిపించాయి.
మిస్టరీగా మారిన నల్లటి రాళ్లు
ఈ ప్రాంతంలో చిన్న రాళ్ల నుంచి పెద్ద గులకరాళ్ల వరకు నల్లటి శిలలు విస్తరించి ఉండటం మరో ఆసక్తికర అంశం. అవి అక్కడికి ఎలా చేరుకున్నాయో ఇప్పటికీ తెలియలేదు. పైభాగంలోని రాతి పొరల నుంచి విరిగి కిందికి జారివచ్చి ఉండవచ్చని, గేల్ క్రేటర్‌ను సృష్టించిన ఉల్కాపాతం సమయంలో దూర ప్రాంతాల నుంచి ఎగిరివచ్చి ఉండవచ్చని, లేదా అవే ఉల్కల అవశేషాలై ఉండవచ్చని శాస్త్రవేత్తలు మూడు ప్రధాన అవకాశాలను పరిశీలిస్తున్నారు.
ఎలా ఏర్పడ్డాయో ?
ఈ తేనెతుట్టె ఆకార భూభాగం ఎలా ఏర్పడిందన్నది ప్రస్తుతం పరిశోధకుల ముందున్న ప్రధాన ప్రశ్న. బిలియన్ల సంవత్సరాల క్రితం మార్స్‌పై అగ్నిపర్వత విస్ఫోటనాలు, ప్రవహించిన నీరు, అవక్షేపాల పేరుకుపోవడం, గాలి కోత, తీవ్రమైన వాతావరణ మార్పులు వంటి అనేక సహజ ప్రక్రియలు చోటుచేసుకున్నాయి. వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రక్రియల ప్రభావంతో ఈ నిర్మాణాలు ఏర్పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
భూమిపై కూడా ఇలాంటి నమూనాలే
భూమిపై బురద ఎండిపోయినప్పుడు ఏర్పడే పగుళ్లు, ఖనిజాల స్ఫటికీకరణ, గడ్డకట్టడం, కరగడం వంటి సహజ ప్రక్రియలతో కూడా ఇలాంటి బహుభుజాకార నమూనాలు కనిపిస్తాయి. మార్స్‌పై కనిపించిన నిర్మాణాలు కూడా అదే కారణాలతో ఏర్పడ్డాయా, లేక పూర్తిగా భిన్నమైన ప్రక్రియల ఫలితమా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
వాతావరణ చరిత్రకు కీలక ఆధారాలు
ఈ నిర్మాణాల అసలు మూలాన్ని గుర్తించగలిగితే ఒకప్పుడు అంగారక గ్రహంపై నీటి ఉనికి, వాతావరణ పరిస్థితులు, భూగర్భ మార్పుల గురించి విలువైన సమాచారం లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్‌లో జీవం ఆనవాళ్ల అన్వేషణకు కూడా ఇవి కీలక ఆధారాలుగా మారవచ్చని అభిప్రాయపడుతున్నారు.
‘కోర్టడేరా’ రాయిపై ప్రత్యేక దృష్టి
ఈ యాత్రలో క్యూరియాసిటీ ‘కోర్టడేరా’ అనే నల్లటి రాయిని అత్యంత సమీపంగా పరిశీలించింది. ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్, మహ్లీ కెమెరా, కెమ్‌క్యామ్ లేజర్ విశ్లేషణ పరికరాల సహాయంతో దాని రసాయన నిర్మాణాన్ని అధ్యయనం చేసింది. సమీపంలోని ‘కోర్డిల్లేరా’ మెసా, ‘వాలే గ్రాండే’ ప్రాంతాలను కూడా విపులంగా చిత్రీకరించింది.
ఉల్కల ఆనవాళ్లా?
గతంలో మార్స్‌పై గుర్తించిన కొన్ని నల్లటి రాళ్లలో నికెల్ వంటి ఖనిజాలు లభించాయి. ఇవి సాధారణంగా ఉల్కల్లో అధికంగా కనిపిస్తాయి. తాజాగా గుర్తించిన రాళ్లలో కూడా అలాంటి ఖనిజాలున్నాయా అనే అంశంపై విశ్లేషణ కొనసాగుతోంది. ఫలితాలు వెలువడితే అంగారకుడి భౌగోళిక పరిణామాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
14 ఏళ్లుగా కొనసాగుతున్న విజ్ఞానయాత్ర
2012లో అంగారక గ్రహంపై దిగిన క్యూరియాసిటీ రోవర్, అప్పటి నుంచి గేల్ క్రేటర్‌లోని పురాతన రాతి పొరలు, ఎండిపోయిన నదీ మార్గాలు, ఖనిజ నిక్షేపాలను పరిశీలిస్తోంది. ఒకప్పుడు అక్కడ సూక్ష్మజీవులు జీవించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన తేనెతుట్టె ఆకార భూభాగం, ఆ అన్వేషణలో మరో కీలక అధ్యాయంగా నిలిచింది. మార్స్ ఎంతగా అధ్యయనం చేసినా ఇంకా ఎన్నో రహస్యాలను తనలో దాచుకుందనే విషయాన్ని ఈ కొత్త ఆవిష్కరణ మరోసారి రుజువు చేసింది.
