అంతరించిపోయే దశకు  చేరిన కోయాలాలు

Koyaalas

జన్యు అధ్యయనంలో సంచలన విషయాలు

ఆస్ట్రేలియాకు ప్రతీకగా నిలిచే కోయాలాలు  దాదాపు లక్ష సంవత్సరాల క్రితమే అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొన్నాయని తాజా జన్యు పరిశోధన వెల్లడించింది. ఈ సంక్షోభానికి కారణం మనుషులు కాదని, తీవ్ర వాతావరణ మార్పులు, మంచు యుగాల ప్రభావమేనని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు మొలెచులర్  బయాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దీని ద్వారా కోయాలాల పరిణామ చరిత్రపై ఇప్పటివరకు ఉన్న అభిప్రాయాలకు కొత్త దృక్పథం లభించింది.

457 కోయాలాల జన్యువుల విశ్లేషణ

ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం మరియు అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రవేత్తలు 457 కోయాలాల జన్యువులను  విశ్లేషించారు. వాటి ఆధారంగా వేల సంవత్సరాలుగా కోయాలాల జనాభా ఎలా తగ్గింది, తిరిగి ఎలా పెరిగిందనే విషయాలను పరిశీలించారు.

తొలిసారిగా కోయాలాల ‘మ్యూటేషన్ రేట్’ కొలత

ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు తొలిసారిగా కోయాలాల జన్యు మార్పుల వేగాన్ని  కొలిచారు. నాలుగు తల్లిదండ్రులు–సంతానం జన్యు నమూనాలను పోల్చి ఈ రేటును లెక్కించారు. దీని ద్వారా కోయాలాల జన్యు గడియారం  మనుషుల కంటే దాదాపు సగం వేగంతో నడుస్తుందని గుర్తించారు. దీంతో గత లక్ష సంవత్సరాల జన్యు చరిత్రను మరింత ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యమైంది.

పాత అభిప్రాయాలకు భిన్నంగా..

ఇప్పటివరకు కోయాలాల సంఖ్య సుమారు 65 వేల సంవత్సరాల క్రితం మనుషులు ఆస్ట్రేలియాకు వచ్చిన తర్వాతే తగ్గిందని భావించేవారు. అయితే ఆ అధ్యయనాలు ఎలుకలు, మనుషుల వంటి ఇతర జాతుల మ్యూటేషన్ రేట్లను ఆధారంగా తీసుకున్నాయి. తాజా పరిశోధన మాత్రం కోయాలాలకే చెందిన అసలు మ్యూటేషన్ రేటును ఉపయోగించడంతో మరింత ఖచ్చితమైన ఫలితాలు లభించాయి.సుమారు 1,00,000 సంవత్సరాల క్రితం కోయాలాల జనాభా తగ్గడం ప్రారంభమైంది. 60 వేల ఏళ్ళ  క్రితం అవి తీవ్రమైన జన్యు బాటిల్‌నెక్ పరిస్థితికి చేరుకున్నాయి. అంటే అప్పటికి ప్రపంచంలోని అన్ని కోయాలాలు చాలా చిన్న సంఖ్యలో మిగిలిన జీవుల నుంచే కొనసాగాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వాతావరణ మార్పులే కారణం

మిలియన్ల సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా మొత్తం దట్టమైన తేమతో కూడిన అడవులతో నిండి ఉండేది. అయితే భూఫలక కదలికలతో ఖండం ఉత్తర దిశగా కదులుతుండటంతో వాతావరణం క్రమంగా పొడిగా మారింది. ప్లీస్టోసీన్ యుగంలో మంచు యుగాలు, వెచ్చని కాలాలు వరుసగా రావడంతో.. అడవులు తగ్గిపోయి కరువు పరిస్థితులు పెరిగాయి. కార్చిచ్చులు ఎక్కువయ్యాయి ఇవి ప్రధాన కారణాలు. 

విడిపోయిన కోయాలా జనాభా

సుమారు 70 వేల సంవత్సరాల క్రితం నల్లార్‌బోర్ మైదానం విస్తరించడంతో పశ్చిమ, తూర్పు ఆస్ట్రేలియా కోయాలాల మధ్య భౌగోళిక విభజన ఏర్పడింది. దీంతో  పశ్చిమ ప్రాంతంలోని కోయాలాలు క్రమంగా అంతరించిపోయాయి. తూర్పు ప్రాంతంలోని అడవుల్లో చిన్న జనాభా మాత్రమే జీవించి మిగిలింది. వాతావరణం మారడంతో మళ్లీ ఇవి విస్తరించడం మొదలయ్యింది.  16,500 నుంచి 6,000 సంవత్సరాల క్రితం వాతావరణం మళ్లీ అనుకూలంగా మారింది. అడవులు తిరిగి విస్తరించడంతో మిగిలిన కోయాలాలు వేగంగా వ్యాపించి, నేడు తూర్పు ఆస్ట్రేలియాలో కనిపించే ఐదు ప్రత్యేక జన్యు సమూహాలుగా పరిణామం చెందాయి.

ఇతర జంతువులపైనా పరిశోధనలు

ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన టోబీ కోవాక్స్ మాట్లాడుతూ, ఇదే జన్యు విశ్లేషణ పద్ధతిని ఇతర ఆస్ట్రేలియా జంతువులపై కూడా ప్రయోగించాలని భావిస్తున్నామని చెప్పారు. ప్రత్యేకంగా అంతరించిపోయిన భారీ జంతువుల బంధువుల జనాభా కూడా మనుషులు రాకముందే తగ్గిందా అనే విషయాన్ని తెలుసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

నేటి కోయాలాలకు కొత్త ముప్పు

ప్రాచీన కాలంలో కోయాలాల సంక్షోభానికి ప్రకృతి కారణమైనప్పటికీ, నేటి పరిస్థితి పూర్తిగా భిన్నమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 2022 నుంచి క్వీన్స్‌లాండ్, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీల్లో కోయాలాలను అధికారికంగా అంతరించిపోతున్న జాతిగా (Endangered Species) ప్రకటించారు. ఐతే  ప్రస్తుతం వాటికి ప్రధాన ముప్పులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా  అడవుల నరికివేత,  నివాస ప్రాంతాల నాశనం,  అడవి మంటలు,  రహదారి ప్రమాదాలు,  కుక్కల దాడులు,  క్లామిడియా వ్యాధి, వేటగాళ్ల వలన ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 

తాజా జన్యు అధ్యయనం వల్ల..

జనాభా వేగంగా తగ్గుతున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించవచ్చు. సన్నిహిత సంతానోత్పత్తి  ప్రమాదాన్ని అంచనా వేయవచ్చు. జన్యు వైవిధ్యాన్ని కాపాడేందుకు సరైన సంరక్షణ చర్యలు చేపట్టవచ్చు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, గతంలో ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలిచిన కోయాలాలు ఇప్పుడు మానవ కార్యకలాపాల వల్ల మరోసారి తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. సరైన సంరక్షణ చర్యలు తీసుకుంటే వాటి మనుగడను కాపాడే అవకాశం ఇంకా ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.