సోషల్ మీడియా యుగంలో పెరుగుతున్న ఒంటరితనం
ఒకప్పుడు సాయంత్రం అయితే వీధుల్లో స్నేహితుల సందడి కనిపించేది. టీ స్టాల్స్,సినిమా థియేటర్స్ వద్ద చిన్న చిన్న విషయాలకే గంటల తరబడి కబుర్లు చెప్పుకునే రోజులు ఉండేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చేతిలో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్ ఉంది.. సోషల్ మీడియాలో వేలాది ఫాలోవర్లు ఉన్నారు.. కానీ మనసు విప్పి మాట్లాడుకునే ఒక్క నిజమైన స్నేహితుడు కూడా లేని పరిస్థితి నెమ్మదిగా సమాజాన్ని చుట్టుముడుతోంది.ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒంటరితనం ఇప్పుడు వైద్య, సామాజిక నిపుణులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే మనిషి జీవితంలో నిజమైన స్నేహబంధాలు గణనీయంగా తగ్గిపోయాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. మన దేశంలో కూడా చెప్పుకోదగ్గ సన్నిహిత స్నేహితుడు లేని వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
స్క్రీన్‌లతో స్నేహం.. మనుషులతో దూరం
డిజిటల్ యుగం మనకు ప్రపంచాన్ని దగ్గర చేసింది. కానీ పక్కనే ఉన్న మనిషిని మాత్రం దూరం చేసింది. గంటల తరబడి మొబైల్ స్క్రీన్‌పై గడిపే సమయం పెరుగుతుండగా, ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకునే సమయం తగ్గిపోతోంది. లైక్‌లు, కామెంట్లు, ఎమోజీలు భావోద్వేగాలకు ప్రత్యామ్నాయంగా మారిపోయాయి.
ఆరోగ్యానికి స్నేహం ఒక ఔషధం
మంచి స్నేహితుడు కేవలం కబుర్లు చెప్పుకునే వ్యక్తి కాదు. కష్టసుఖాల్లో అండగా నిలిచే బలం. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో, ఆందోళనను దూరం చేయడంలో, ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో స్నేహబంధాల పాత్ర ఎంతో కీలకం. సన్నిహిత స్నేహితులు ఉన్నవారు సాధారణంగా మరింత సంతోషంగా, చురుకుగా జీవిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
స్నేహానికి పెట్టుబడి.. సమయం
నిజమైన స్నేహం ఒక్క రోజులో ఏర్పడదు. పరిచయం స్నేహంగా మారాలంటే కలిసి గడిపే సమయం అవసరం. నమ్మకం, ఆప్యాయత, పరస్పర అర్థం చేసుకోవడం క్రమంగా పెరిగితేనే ఆ బంధం బలపడుతుంది. అయితే నేటి వేగవంతమైన జీవితంలో ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత బాధ్యతల మధ్య స్నేహితులకు సమయం కేటాయించడం చాలామందికి కష్టంగా మారుతోంది.
సోషల్ మీడియా స్నేహాలు.. నిజ జీవితానికి సరిపోతాయా?
ఫేస్‌బుక్‌లో వేల మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు. వాట్సాప్‌లో వందల గ్రూపులు ఉండొచ్చు. కానీ కష్టకాలంలో ఫోన్ చేసి “నేను ఉన్నాను” అని చెప్పే వ్యక్తి ఎన్ని మంది ఉన్నారు? వర్చువల్ పరిచయాలు వినోదాన్ని అందించవచ్చు. కానీ నిజమైన ఆప్యాయతను మాత్రం ముఖాముఖి బంధాలే ఇస్తాయి.
బంధాలను కాపాడుకోవాలంటే..
స్నేహం నిలవాలంటే ప్రతిరోజూ పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. రోజులో కొన్ని నిమిషాలు పలకరించడం, అప్పుడప్పుడు కలిసి కూర్చోవడం, వారి సంతోషం–బాధలను పంచుకోవడం చాలు. చిన్న చిన్న అపార్థాలను పట్టించుకోకుండా క్షమించడం, అవసరమైనప్పుడు ముందుగా మాట్లాడడం కూడా బంధాన్ని బలపరుస్తాయి.
జీవితాంతం మన వెంట నడిచేది సంపద కాదు..పదవి కాదు.. మనతో నవ్విన, ఏడ్చిన, నిలిచిన మనుషులే. అందుకే స్నేహాన్ని విలువైన సంపదగా భావించాలి. ఈరోజు నుంచే చాలాకాలంగా మాట్లాడని ఒక స్నేహితుడికి ఫోన్ చేయండి. ఒక చిన్న పలకరింపే ఎన్నో బంధాలకు మళ్లీ ప్రాణం పోస్తుంది. ఎందుకంటే స్నేహం బతికితేనే మనిషి జీవితం పరిపూర్ణంగా ఉంటుంది
