మహాభారత విలన్‌ను పూజించే కేరళ ఆలయం వెనుక ఆసక్తికర కథ
మహాభారతంలో శకుని పేరు వినగానే కుట్రలు, కుతంత్రాలు, పాచికల ఆట, కౌరవ–పాండవుల మధ్య యుద్ధానికి కారణమైన వ్యక్తి గానే గుర్తొస్తాడు. కేరళలోని ఒక ఆలయంలో శకునిని పూజించడం విశేషం. ఈ సంప్రదాయం భారతీయ పురాణాలపై ప్రాంతీయ జానపద విశ్వాసాలను తెలియజేస్తుంది.
శకుని ఆలయం ఎక్కడ ఉంది?
కేరళలోని కొల్లం జిల్లాలోని మాయంకొట్టు మలంచరువు మలనాడ ఆలయం (Mayamkottu Malancharuvu Malanada Temple) శకునితో అనుబంధం ఉన్న ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఇతర హిందూ దేవాలయాల్లా శకుని విగ్రహం ఉండదు. ఆయన ఉనికికి ప్రతీకగా ఎత్తైన వేదిక (పీఠం) మాత్రమే ఉంటుంది. భక్తులు దాన్ని పూజిస్తారు.
శకునితో ఈ ఆలయానికి ఉన్న సంబంధం ఏమిటి?
స్థానిక జానపద కథనాల ప్రకారం శకుని తాను ప్రయాణిస్తూ ఒకసారి ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించాడని విశ్వసిస్తారు. కురవ (Kurava) సమాజం ఆయనను గౌరవనీయుడిగా ఆరాధించే సంప్రదాయం ఏర్పడింది. ప్రచారంలో ఉన్న మరో కథనం ప్రకారం శకుని ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు వ్యవసాయం, నీటి నిర్వహణ, సామాజిక వ్యవహారాల్లో సహాయం చేశాడని నమ్మకం. అందుకే ఆయనను గ్రామ రక్షకుడిగా, కష్టాలను తొలగించే దైవంగా ఆరాధించే సంప్రదాయం ఏర్పడింది.
మలనాడ కెట్టుకచ్చ ఉత్సవం
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే మలనాడ మలనాడ కెట్టుకచ్చ (Malanada Kettukazhcha) ఉత్సవం ఎంతో ప్రసిద్ధి. భారీగా అలంకరించిన రథాలు ఇందులో కనిపిస్తాయి. ఈ రథాలతో జరిగే శోభాయాత్ర ఈ ప్రాంతానికే వన్నె తెస్తుంది. వేలాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు.
శకునిపై భిన్నమైన అభిప్రాయం ఎందుకు ..
సాధారణంగా మహాభారతంలో శకునిని దుర్యోధనుడిని రెచ్చగొట్టి పాండవులకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వ్యక్తిగా చిత్రిస్తారు. కొన్ని ప్రాంతీయ కథనాలు వేరే కోణాన్ని చెబుతాయి. కురు వంశం శకుని తండ్రి, సోదరులను బంధించి తీవ్ర కష్టాలకు గురిచేసిందని చెబుతాయి. మరణానికి ముందు తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని శకునికి తండ్రి చెప్పాడని జానపద కథనం. ఈ నేపథ్యంలో శకుని చర్యలు వ్యక్తిగత ప్రతీకారం, కుటుంబ విధేయతతో జరిగాయని భావిస్తారు. ఈ కథనాలు శకునిని పూర్తిగా ధర్మాత్ముడిగా చూపకపోయినా, ఆయన పాత్రను కొంచెం పాజిటివ్ కొంచెం నెగటివ్ మిశ్రమ లక్షణాలు కలిగిన వ్యక్తిగా చూపిస్తాయి. భారతీయ పురాణాల్లో పాత్రలను కేవలం మంచి–చెడు అనే రెండు కోణాల్లో మాత్రమే చూడరు. వివాదాస్పద పాత్రలలో కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలను గౌరవించే సంప్రదాయం ఉంది. శకునిని కొందరు అసాధారణ వ్యూహకర్తగా, రాజకీయ చతురత కలిగిన వ్యక్తిగా, పాచికల ఆటలో నిపుణుడిగా గుర్తిస్తారు.
కేరళ జానపద సంప్రదాయం
కేరళలో మహాభారత కథ స్థానిక జానపద విశ్వాసాలతో కలిసిపోయింది. శకుని స్థానిక తెగలతో సంబంధాలు ఏర్పరచుకున్నాడని, వారిని రక్షించిన వ్యక్తిగా భావించే కథనాలు ఉన్నాయి. అందువల్ల అక్కడి ప్రజల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. దీని వల్ల మనం అర్ధం చేసుకోవాల్సిన సందేశం ఏంటంటే మహాభారతం కేవలం హీరోలు–విలన్ల కథ కాదు. ప్రతీకారం, విధి, వ్యక్తిగత నిర్ణయాలు, రాజకీయ కుట్రలు సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూపించే మహాకావ్యం. శకునికి అంకితమైన ఈ ఆలయం కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తుంది.
