అంటార్కిటికాలో భారీ హమ్మింగ్‌బర్డ్?

Antartica

– నిసార్ ఉపగ్రహం కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం

భారత్–అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక భూ పరిశీలనా ఉపగ్రహం నిసార్ (NISAR – NASA-ISRO Synthetic Aperture Radar) అంటార్కిటికాలో ఒక భారీ హమ్మింగ్‌బర్డ్ (చిన్న పక్షి) ఆకారాన్ని పోలిన అద్భుత దృశ్యాన్ని కాప్చర్ చేసింది . అయితే ఇది నిజమైన పక్షి కాదు. పర్వతాలు, మంచు, రాడార్ సాంకేతికత కలయిక వల్ల ఏర్పడిన దృష్టి భ్రమ (Optical Illusion) మాత్రమేనని నాసా వెల్లడించింది.

హమ్మింగ్‌బర్డ్ ఆకారం ఎలా ఏర్పడింది?

నాసా విడుదల చేసిన నివేదిక ప్రకారం, నిసార్ ఉపగ్రహం తీసిన తొలి చిత్రాల్లో అంటార్కిటికాలోని పగుళ్లతో కూడిన మంచు ఉపరితలం అత్యంత స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో ఆ భౌగోళిక నిర్మాణం ఒక భారీ హమ్మింగ్‌బర్డ్ పక్షిలా కనిపించడంతో దీనికి “ది హమ్మింగ్‌బర్డ్” అనే పేరు పెట్టారు.

అత్యాధునిక ఎల్-బ్యాండ్ రాడార్ సాంకేతికత

ఈ చిత్రాలను నిసార్ ఉపగ్రహంలోని ఎల్-బ్యాండ్ (L-band) సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR) రూపొందించింది. ఈ చిత్రాలు ఉపగ్రహం అత్యంత స్పష్టమైన, ఖచ్చితమైన సమాచారాన్ని అందించే సామర్థ్యాన్ని నిరూపించాయని నాసా తెలిపింది.

రంగులు ఏమి చెబుతున్నాయి?

ఈ చిత్రాల్లో కనిపించే రంగులు మంచు నుంచి తిరిగి ప్రతిఫలించిన మైక్రోవేవ్ రాడార్ సంకేతాల స్వభావాన్ని సూచిస్తాయి.

మెజెంటా (Magenta): సమతలమైన, మృదువైన మంచు ఉపరితలం నుంచి అడ్డంగా (Horizontal) తిరిగి వచ్చిన సంకేతాలను సూచిస్తుంది.

ఆకుపచ్చ : మంచు లోపలికి కొంత చొచ్చుకెళ్లి లేదా పగుళ్లు, అసమాన ఉపరితలాల నుంచి వివిధ దిశల్లో ప్రతిఫలించిన సంకేతాలను సూచిస్తుంది. దీనిని వాల్యూమ్ స్కాటరింగ్  అంటారు.

తెలుపు : మెజెంటా, ఆకుపచ్చ రెండు రకాల సంకేతాలు బలంగా తిరిగి వచ్చిన ప్రాంతాలను సూచిస్తుంది. అంటే అక్కడ ఉపరితల ప్రతిఫలనం, అంతర్గత ప్రతిఫలనం రెండూ సమానంగా ఉన్నట్లు భావిస్తారు.

సాధారణ కెమెరాలో కనిపించదు.  నాసా తెలిపిన ప్రకారం, ఇదే ప్రాంతాన్ని సాధారణ ఆప్టికల్ కెమెరాతో చూస్తే అంతా తెల్లటి మంచుతో కప్పబడి కనిపిస్తుంది. తేలికపాటి  నీడలు, ఉపరితల అలల ద్వారా మాత్రమే పర్వత శిఖరాలు, మంచు నిర్మాణాలు గుర్తించగలం. కానీ నిసార్ రాడార్ మంచు అడుగున ఉన్న నిర్మాణాలను కూడా విశ్లేషించే సామర్థ్యం దాని సొంతం. 

వాతావరణ మార్పుల అధ్యయనానికి కీలకం

ఈ చిత్రాలు కేవలం ఆకట్టుకునేవే కాదు. హిమానీనదాల కదలికలు, మంచు కరుగుదల, సముద్ర మట్టం పెరుగుదల, వాతావరణ మార్పుల ప్రభావాలను అత్యంత ఖచ్చితంగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

నిసార్ ప్రత్యేకతలు

నిసార్ ప్రపంచంలోనే  శక్తివంతమైన భూ పరిశీలనా ఉపగ్రహాల్లో ఒకటి. దీనిని నాసా (NASA), ఇస్రో (ISRO) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే అంచనా వేయడానికి అవసరమైన కీలక సమాచారాన్ని అందిస్తుంది.

ఎల్-బ్యాండ్ (NASA), ఎస్-బ్యాండ్ (ISRO) అనే రెండు వేర్వేరు ఫ్రీక్వెన్సీల రాడార్ వ్యవస్థలను కలిగి ఉన్న ప్రపంచంలోని తొలి ఉపగ్రహం ఇదే. దీనిని గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు.