శనిగ్రహంలో ఏటా వెయ్యి టన్నుల వజ్రాల వర్షం?

Dimonds

శాస్త్రవేత్తల ఆసక్తికర సిద్ధాంతం

శని గ్రహం దాని విశాలమైన వలయాల కారణంగా ఎప్పటినుంచో ప్రత్యేకంగా నిలుస్తోంది. దాని   లక్షణాలలో ఒకటి మేఘాల పైభాగం కింద చాలా లోతులో, కంటికి కనిపించకుండా దాగి ఉందని కొంతమంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఆ భారీ గ్రహం నీరు లేదా మంచుకు బదులుగా, మెరుపులు, అపారమైన పీడనం  తీవ్రమైన వేడితో  రసాయన, భౌతిక మార్పుల  ద్వారా దాని వాతావరణం లోపల లోతుగా వజ్రాలను ఉత్పత్తి  చేసే అవకాశం ఉందని తెలుస్తోంది .  ఏటా సుమారు 1,000 టన్నుల వజ్రాలు ఏర్పడే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మెరుపులు, అత్యంత అధిక పీడనం, తీవ్రమైన ఉష్ణోగ్రతలతో  ఈ ప్రక్రియ సహజంగానే జరిగే అవకాశముందని వారు వివరిస్తున్నారు.  ఇదొక కల్పిత  శాస్త్రీయ  కథలా అనిపించినా  ఈ సిద్ధాంతానికి రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రాల ఆధారంగా వివరణలు ఉన్నాయి. శనిగ్రహం వాతావరణంలో విడుదలయ్యే కార్బన్ క్రమంగా గట్టిబడి  వజ్రాలుగా మారతాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

మీథేన్ నుంచే వజ్రాల ఆరంభం

శనిగ్రహం వాతావరణంలో ప్రధానంగా హైడ్రోజన్, హీలియం వాయువులే ఉన్నప్పటికీ, కొంతమేర మీథేన్ (Methane) కూడా ఉంటుంది. ఈ మీథేనే వజ్రాల ఏర్పాటుకు మూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని విస్కాన్సిన్–మాడిసన్ విశ్వవిద్యాలయం మరియు నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీకి చెందిన డాక్టర్ కెవిన్ బైన్స్ వివరించిన ప్రకారం, శనిగ్రహంలోని భారీ తుఫాన్లలో ఏర్పడే మెరుపులు మీథేన్ అణువులను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో మిగిలిన కార్బన్ సూక్ష్మమైన మసి (సూట్) కణాలుగా మారి కిందికి పడటం ప్రారంభిస్తుంది.

మసి నుంచి గ్రాఫైట్.. చివరకు వజ్రాలు

ఈ కార్బన్ కణాలు శనిగ్రహం లోతుల్లోకి దిగుతున్న కొద్దీ పీడనం క్రమంగా పెరుగుతుంది. మొదట ఇవి గ్రాఫైట్‌గా (పెన్సిల్ లీడ్‌లో ఉండే కార్బన్ రూపం) మారతాయి. ఆ తర్వాత మరింత లోతులో  అధిక పీడనం కారణంగా గ్రాఫైట్ వజ్రాలుగా రూపాంతరం చెందుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమితో పోలిస్తే శనిగ్రహంలో వాతావరణం వేల కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉండటం వల్ల కార్బన్ వివిధ రూపాల్లోకి మారేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని వారు చెబుతున్నారు.

ఏడాదికి వెయ్యి టన్నుల వజ్రాలు

డాక్టర్ కెవిన్ బైన్స్ ప్రకారం శనిగ్రహంలో ఏటా  సుమారు 1,000 టన్నుల వజ్రాలు ఏర్పడవచ్చు. అయితే ఈ ప్రక్రియను ఏ అంతరిక్ష నౌక కూడా నేరుగా పరిశీలించలేదని ఆయన అంగీకరించారు. ‘దీనిని ఎలా నిర్ధారిస్తారు అని చాలామంది అడుగుతారు. ప్రత్యక్షంగా వెళ్లి చూడడం సాధ్యం కాదు. అందుకే మా అంచనాలు రసాయన శాస్త్రం ఆధారంగా ఉన్నాయి. ఈ ప్రక్రియ జరిగే అవకాశంపై మాకు బలమైన విశ్వాసం ఉంది’ అని ఆయన చెప్పారు.

వజ్రాలు కూడా కరిగిపోతాయా?

వజ్రాలు ఏర్పడిన తర్వాత కూడా వాటి ప్రయాణం అక్కడితో ముగిసిపోదు. శనిగ్రహం లోతుల్లోకి సుమారు మరో 30,000 కిలోమీటర్లు దిగిన తర్వాత పీడనం, ఉష్ణోగ్రత మరింత పెరుగుతాయి. ఆ పరిస్థితుల్లో ఘన వజ్రాలు కూడా కరిగిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో శనిగ్రహం అంతర్భాగంలో ద్రవరూప కార్బన్ (Liquid Carbon) లేదా ‘ద్రవ వజ్రాల సముద్రం’ వంటి పొర ఉండే అవకాశాన్ని వారు పరిశీలిస్తున్నారు. అయితే అక్కడ కార్బన్ ఎలా ప్రవర్తిస్తుందో ఇప్పటికీ పూర్తిగా స్పష్టత లేదు.

యురేనస్, నెప్ట్యూన్‌లో పరిస్థితి భిన్నం

శనిగ్రహంతో పోలిస్తే యురేనస్, నెప్ట్యూన్ గ్రహాల అంతర్భాగాలు చల్లగా ఉంటాయి. అందువల్ల అక్కడ ఏర్పడే వజ్రాలు కరగకుండా ఘన రూపంలోనే నిలిచి, కాలక్రమేణా పేరుకుపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇంకా నిర్ధారణ కాలేదు

ఈ ‘వజ్రాల వర్షం’ సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించినప్పటికీ, ఇది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఈ పరిశోధన మొదట ప్రతిపాదించిన సమయంలో పీర్ రివ్యూ (Peer Review) పూర్తి కాలేదు. అలాగే హైడ్రోజన్, హీలియం అధికంగా ఉన్న శనిగ్రహ వాతావరణంలో కార్బన్ ఎలా ప్రవర్తిస్తుందనే అంశంపై ఇంకా అనేక సందేహాలు ఉన్నాయి.