ప్రభుత్వ ఉద్యోగి నుంచి నోబెల్ విజేత వరకు.. 

Cv raman

– సీవీ రామన్ అసాధారణ ప్రయాణం

భారతదేశ చరిత్రలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ప్రపంచాన్ని మార్చిన శాస్త్రవేత్తల కథల్లో  సర్ చంద్రశేఖర వెంకట రామన్ (సీవీ రామన్)ది అత్యంత స్ఫూర్తిదాయకమైనది. ఆయన శాస్త్రీయ ప్రయాణం ప్రయోగశాలలో కాదు, ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యాలయంలో ప్రారంభమైంది.

శాస్త్రవేత్త కావాలన్న కల.. కానీ అవకాశాలు లేవు

1907లో మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి కేవలం 18 ఏళ్ల వయసులోనే రికార్డు మార్కులతో ఎంఏ పూర్తి చేసిన సీవీ రామన్, అప్పటికే ఒక భౌతిక శాస్త్ర పరిశోధనా పత్రాన్ని బ్రిటిష్ జర్నల్‌లో ప్రచురించారు. ఆయన కల శాస్త్రవేత్త కావడమే. అయితే అప్పట్లో బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంలో పరిశోధనకు అవసరమైన సంస్థలు, నిధులు, అవకాశాలు దాదాపు లేవు. దీంతో ఆయన ఫైనాన్షియల్ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి ప్రథమ స్థానం సాధించారు. అనంతరం కలకత్తాలోని ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్ గా  నియమితులయ్యారు. చూస్తే ఆయన జీవితం ప్రభుత్వ లెక్కలు, ఆడిట్లకే పరిమితమైనట్లే కనిపించింది. కానీ భౌతిక శాస్త్రంపై ఆయన ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

ప్రభుత్వ ఉద్యోగంతో పాటు పరిశోధనలు

ఉద్యోగంలో చేరిన అదే ఏడాది ‘న్యూటన్స్  రింగ్స్ ఇన్ పోలరైజ్డ్ లైట్’ అనే పరిశోధనా వ్యాసాన్ని ప్రముఖ శాస్త్రీయ పత్రిక నేచర్ లో  ప్రచురించారు. న్యూటన్ రెండు శతాబ్దాల క్రితం అధ్యయనం చేసిన ‘న్యూటన్ రింగ్స్’ అనే కాంతి సిద్ధాంతాన్ని అప్పటి ప్రముఖ పాఠ్యపుస్తకాలు తప్పుగా వివరిస్తున్నాయని రామన్ గుర్తించారు. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఆ తప్పును ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక శాస్త్రీయ పత్రికలో సరిదిద్దుతూ, అది “తీవ్రమైన పొరపాటు” అని ధైర్యంగా పేర్కొన్నారు. అది చిన్న వ్యాసమే అయినా, భారతదేశంలో ఒక అసాధారణ శాస్త్రీయ మేధస్సు ఆవిర్భవించిందనే సంకేతంగా నిలిచింది.

పగలు ప్రభుత్వ ఉద్యోగం.. రాత్రిళ్లు ప్రయోగాలు

కలకత్తాకు వచ్చిన తర్వాత రామన్‌కు ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (IACS) అనే పరిశోధనా సంస్థ పరిచయమైంది. ఆ తర్వాత పగటిపూట ప్రభుత్వ కార్యాలయంలో లెక్కలు చూసేవారు. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు IACS ప్రయోగశాలలో కాంతి, ధ్వని, వయోలిన్, తబలా వంటి సంగీత వాయిద్యాల భౌతిక శాస్త్రంపై పరిశోధనలు చేసేవారు. అనేక ప్రయోగాలను ఆయన సొంత డబ్బుతోనే నిర్వహించారు. కొన్నిసార్లు తెల్లవారుజాము వరకు ప్రయోగశాలలో పనిచేసి, అక్కడి నుంచే నేరుగా కార్యాలయానికి వెళ్లేవారని ఆయన సహచరులు గుర్తుచేశారు. రామన్‌కు ప్రభుత్వ ఉద్యోగం జీవనోపాధి మాత్రమే. శాస్త్ర పరిశోధనే అసలు లక్ష్యం. మధ్యధరా సముద్రం రంగు తెచ్చిన విప్లవాత్మక ఆవిష్కరణ

 1921లో ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి ఓడలో వస్తున్నప్పుడు రామన్ దృష్టిని మధ్యధరా సముద్రం (Mediterranean Sea) నీలి రంగు ఆకర్షించింది. సముద్రం ఆకాశం రంగును ప్రతిబింబించడం వల్లే నీలంగా కనిపిస్తుందని అప్పటి శాస్త్రీయ వివరణ ఆయనను సంతృప్తిపరచలేదు. నీటిలో కాంతి ప్రయాణించినప్పుడు అసలు ఎం  జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఆయనలో కలిగింది. ప్రశ్నకు సమాధానం కోసం దాదాపు ఏడు సంవత్సరాలపాటు పరిశోధనలు సాగించారు.

రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ

చివరకు 1928 ఫిబ్రవరి 28న, తన శిష్యుడు కే.ఎస్. కృష్ణన్ తో  కలిసి రామన్ ఒక విప్లవాత్మక ఆవిష్కరణ చేశారు. పారదర్శక పదార్థం గుండా కాంతి ప్రయాణించినప్పుడు దానిలోని కొంత భాగం తరంగదైర్ఘ్యాన్ని మార్చుకుని వేరే రంగులో విక్షేపం చెందుతుందని వారు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణే ప్రపంచవ్యాప్తంగా  “రామన్ ఎఫెక్ట్”గా ప్రసిద్ధి చెందింది. ఈ సిద్ధాంతం ద్వారా పదార్థాల అణు నిర్మాణాన్ని అధ్యయనం చేసే కొత్త మార్గం శాస్త్రవేత్తలకు లభించింది. నేడు ఇది రసాయన శాస్త్రం, ఔషధ పరిశోధనలు, ఫోరెన్సిక్ సైన్స్, అంతరిక్ష పరిశోధనలు వంటి అనేక రంగాల్లో కీలకంగా ఉపయోగపడుతోంది. ఈ ఆవిష్కరణ జ్ఞాపకార్థమే భారత్‌లో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28ను జాతీయ విజ్ఞాన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

నోబెల్ బహుమతి 

1930లో కాంతి విక్షేపణపై చేసిన పరిశోధనలు, రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు    సీవీ రామన్‌కు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.

ఆయన సాధించిన ఘనతలు 

శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి ఆసియా శాస్త్రవేత్త.    భారతదేశంలోనే పరిశోధనలు చేస్తూ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక భారతీయుడు.

స్ఫూర్తిదాయకమైన జీవితం

విదేశాలకు వెళ్లి చదివే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఒక యువకుడు, తన ఖాళీ సమయాన్ని శాస్త్ర పరిశోధనకు అంకితం చేసి, ప్రపంచ భౌతిక శాస్త్ర చరిత్రనే మార్చాడు. ప్రభుత్వ ఉద్యోగం అతని గమ్యం కాదు; శాస్త్రంపై ఉన్న అంకితభావమే అతన్ని నోబెల్ బహుమతి వరకు తీసుకెళ్లింది. సీవీ రామన్ జీవితం పట్టుదల, కుతూహలం, నిరంతర పరిశోధన ఉంటే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ప్రపంచస్థాయి విజయాలు సాధించవచ్చని చాటి చెప్పే చిరస్మరణీయ గాథ.