విలేకరులపై దాడులు చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
విజయవాడ/చండీగఢ్: న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనల కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై జరిగిన భౌతిక దాడులు, బెదిరింపులను ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. నిరసనకారులు, భద్రతా సిబ్బంది ఇద్దరూ విధి నిర్వహణలో ఉన్న రిపోర్టర్లు, వీడియో జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఐజేయూ అధ్యక్షుడు బల్విందర్ సింగ్ జమ్మూ, సెక్రటరీ జనరల్ డి. సోమసుందర్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న విద్యార్థి నిరసనలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం మీడియా బాధ్యత అని, అలాంటి బాధ్యతను నిర్వర్తిస్తున్న పాత్రికేయులపై దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. ఆందోళనలను కవర్ చేయడానికి వెళ్లిన విలేకరులు, వీడియో జర్నలిస్టులపై నిరసనకారులు, భద్రతా సిబ్బంది దాడులు చేయడం మీడియా స్వేచ్ఛపై దాడిగానే భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థులతో పాటు పాత్రికేయులపై కూడా భద్రతా దళాలు షాక్ బ్యాటన్లు, పెల్లెట్ గన్స్ వినియోగించడం, బలప్రయోగానికి దిగడం తీవ్రంగా ఖండనీయమని ఐజేయూ పేర్కొంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులకు చెందిన కొందరు అధికారులు నేమ్ బ్యాడ్జీలు లేకుండా విధులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని, తమ గుర్తింపును దాచిపెట్టే ప్రయత్నాలను సమర్థించలేమని తెలిపింది.
కొన్ని మీడియా సంస్థల సంపాదకీయ విధానాలపై ఉన్న అసంతృప్తిని క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులపై దాడుల రూపంలో వ్యక్తం చేయడం సమంజసం కాదని ఐజేయూ స్పష్టం చేసింది. సంపాదకీయ విధానాలను నిర్ణయించడంలో రిపోర్టర్లు, వీడియో జర్నలిస్టుల పాత్ర ఉండదని, యాజమాన్యాల నిర్ణయాలకు వారిని బాధ్యులను చేయడం తగదని సూచించింది. అదే సమయంలో ప్రతి మీడియా సంస్థకు తన సంపాదకీయ విధానాన్ని స్వతంత్రంగా నిర్ణయించుకునే హక్కు ఉందని పునరుద్ఘాటించింది.
అయితే కొన్ని మీడియా సంస్థల యాజమాన్యాలు అనుసరిస్తున్న ధోరణులు మీడియా విశ్వసనీయతను, జర్నలిజం ప్రమాణాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఐజేయూ, ఆ అంశాలపై ఆయా యాజమాన్యాలు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరింది.
మీడియా సిబ్బందిపై జరిగిన దాడులను కాక్రోచ్ జనతా పార్టీ ఖండించడాన్ని ఐజేయూ స్వాగతించింది. ఢిల్లీ పోలీసులు పాత్రికేయులపై జరిపిన దాడులపై స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలను ఐజేయూ డిమాండ్ చేసింది.
