పురాతన ఈజిప్టులోని 5 వింత ఆచారాలు!

Egypt

వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది 

పురాతన ఈజిప్టు నాగరికత అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది  పిరమిడ్లు, ఫారో టుటన్‌ఖామున్‌ బంగారు ముసుగు, గద్ద తలతో కనిపించే సూర్యదేవుడు రా, నైలు నది, క్లియోపాత్రా రాజకీయ చతురత. వేల ఏళ్ల క్రితం ఇంత అభివృద్ధి చెందిన నాగరికతను నిర్మించిన ఈజిప్షియన్లను ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూస్తుంది. కానీ ఈ గొప్ప నాగరికత చరిత్రలో  వింటేనే చిరాకనిపించే  కొన్ని ఆచారాలు, నమ్మకాలు  ఉన్నాయి. పాపిరస్‌ పత్రాలు, సమాధులు, పురావస్తు ఆధారాలు, మానవ అవశేషాల అధ్యయనాల ద్వారా అప్పటి ప్రజల జీవితం, శిక్షలు, వైద్యం, అధికారం, మరణం తర్వాతి జీవితం గురించి ఎన్నో విషయాలు బయటపడ్డాయి. మనకు ఇప్పుడు వింతగా, భయానకంగా అనిపించే అలాంటి ఐదు ఆచారాలు ఇవి.

ఫారోతో పాటు సేవకులు కూడా చనిపోవడం?

పురాతన ఈజిప్టులో ఫారోను  శక్తివంతమైన వ్యక్తిగా భావించేవారు. ఆయనకు మరణం తర్వాత  జీవితం ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు .  కొన్ని పురాతన సమాధుల ఆధారాలు, చారిత్రక వివరాల ప్రకారం.. కొంతమంది పాలకుల కాలంలో రాజుతో పాటు సేవకులు లేదా పరిచారకులను కూడా సమాధి చేసే ఆచారం ఉన్నట్లు తెలుస్తోంది. నమ్మకం ఏమిటంటే.. ఫారోకు మరణం తర్వాత కూడా సేవకులు అవసరమవుతారని. జీవితంలో రాజుకు సేవ చేసిన వారు మరణం తర్వాత కూడా అతనితో ఉండాలి, అతని అవసరాలను తీర్చాలి అనే భావన ఉండేది. అందుకే కొంతమంది సేవకుల సమాధులు ఫారో సమాధికి సమీపంలో ఉండేవి. అయితే ప్రతి ఫారోతో సేవకులను తప్పనిసరిగా చంపేవారని చెప్పడం సరైంది కాదు. పురావస్తు ఆధారాల ప్రకారం ఈ పద్ధతి కొన్ని ప్రారంభ రాజవంశాల కాలంలో కనిపించినప్పటికీ, తరువాతి కాలాల్లో నిజమైన మనుషుల స్థానంలో చిన్న విగ్రహాలు, నమూనా సేవకుల రూపాలు ఉపయోగించారని తెలుస్తోంది. అయినా.. ఒక మనిషి మరణించిన తర్వాత కూడా తన యజమానికి సేవ చేయాలనే భావన అప్పటి సమాజంలోని అధికారం, సామాజిక అసమానతలను చూపిస్తుంది.

రా ను అవమానిస్తే.. మరణశిక్ష!

రా  పురాతన ఈజిప్టు మతంలో రా  ముఖ్యమైన దేవతల్లో ఒకరు. సూర్యుడికి ప్రతిరూపంగా భావించిన రా.. సృష్టి, రాజాధికారం, విశ్వంలోని క్రమానికి సంబంధించిన దేవుడిగా పూజించబడేవాడు. అందువల్ల దేవుడిని అవమానించడం సాధారణ తప్పుగా పరిగణించేవారు కాదు. దేవుడిని అవమానించడం, పవిత్ర ఆలయాలను ధ్వంసం చేయడం లేదా దోచుకోవడం వంటి తీవ్రమైన నేరాలకు కఠినమైన శిక్షలు ఉండేవి. కొన్ని సందర్భాల్లో సజీవ దహనం వంటి  తీవ్రమైన శిక్షలను అమలు చేసిన  ఆధారాలు ఉన్నాయి. అప్పటి ఈజిప్షియన్ల నమ్మకాల ప్రకారం.. శరీరాన్ని పూర్తిగా కాల్చివేస్తే ఆ వ్యక్తి ఆత్మ కూడా నాశనమవుతుందని భావించేవారు. దీంతో మరణం తర్వాతి ప్రపంచంలోకి ప్రవేశించే అవకాశం కూడా కోల్పోతారని నమ్మకం. అందువల్ల సజీవ దహనం కేవలం శారీరక శిక్ష మాత్రమే కాదు.. మరణం తర్వాతి జీవితాన్నే శాశ్వతంగా కోల్పోయే శిక్షగా భావించబడేది.

గర్భం రాకుండా మొసలి పేడ!

పురాతన కాలంలో నేటిలా కుటుంబ నియంత్రణకు అనేక పద్ధతులు, మందులు అందుబాటులో లేవు. అందువల్ల గర్భం రాకుండా ఉండేందుకు మహిళలు వివిధ రకాల పద్ధతులను ఉపయోగించేవారు. పురాతన ఈజిప్టు వైద్య పత్రాల్లో మొసలి పేడను ఇతర పదార్థాలతో కలిపి మహిళల జననాంగ ప్రాంతంలో ఉపయోగించే పద్ధతి గురించి ప్రస్తావనలు ఉన్నాయి. అప్పటి నమ్మకం ప్రకారం ఇది గర్భధారణను అడ్డుకోవడానికి సహాయపడుతుందని భావించేవారు. అయితే ఈ పద్ధతి నిజంగా ఎంత ప్రభావవంతంగా పనిచేసిందో స్పష్టంగా తెలియదు. ఆధునిక శాస్త్రీయ ప్రమాణాలతో చూస్తే ఇది సురక్షితమైన  గర్భనిరోధక పద్ధతి కాదు. అయినా వేల ఏళ్ల క్రితమే ప్రజలు గర్భధారణను నియంత్రించేందుకు ప్రయత్నించారని ఈ ఆధారాలు తెలియజేస్తున్నాయి.

బిడ్డ ఆడా? మగా? ధాన్యాలతో పరీక్ష!

ఈ రోజుల్లో అల్ట్రాసౌండ్‌ ద్వారా గర్భంలోని శిశువు గురించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు. కానీ పురాతన ఈజిప్టులో అలాంటి సాంకేతికత ఏదీ లేదు. అందుకే గర్భం వచ్చిందా లేదా  బిడ్డ ఆడా మగా అనే విషయాన్ని అంచనా వేయడానికి ఒక విచిత్రమైన పద్ధతి ఉపయోగించినట్లు పురాతన వైద్య పత్రాల్లో కనిపిస్తుంది. గర్భిణి మహిళ గోధుమలు, బార్లీ గింజలతో నింపిన రెండు సంచులపై మూత్రం పోయాలి.ఆ తర్వాత ఆ గింజల్లో ఏవి ముందుగా మొలకెత్తుతాయో గమనించేవారు. బార్లీ ముందుగా మొలిస్తే మగబిడ్డ పుడుతుందని భావించేవారు. గోధుమ ముందుగా మొలిస్తే ఆడబిడ్డ పుడుతుందని అనుకునేవారు. రెండు రకాల గింజలు మొలకెత్తకపోతే గర్భం లేదని భావించేవారు. ఆధునిక పరిశోధనల ప్రకారం ఈ పద్ధతిలో గర్భాన్ని  గుర్తించే విషయంలో  శాస్త్రీయ ఆధారం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, బిడ్డ లింగాన్ని చెప్పడంలో ఇది నమ్మదగిన పద్ధతి కాదు. అయినా వేల సంవత్సరాల క్రితమే గర్భాన్ని గుర్తించేందుకు సహజ పద్ధతులను ఉపయోగించారనే విషయం ఆసక్తికరం.

జుట్టు నల్లగా ఉండేందుకు కుళ్లిన గాడిద కాలేయం!

పురాతన ఈజిప్షియన్లు తమ అందం,  అలంకరణకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. చర్మం, జుట్టు ఎలా ఉన్నాయనే విషయం వారి సామాజిక స్థితితో కూడా సంబంధం కలిగి ఉండేది. తెల్ల జుట్టు కనిపించకుండా చేసేందుకు వారు వింత పద్ధతులను ఉపయోగించేవారు. అందులో ఒకటి గాడిద కాలేయాన్ని కుళ్లబెట్టి ఉపయోగించడం. గాడిద కాలేయాన్ని ఒక పాత్రలో ఉంచి కొంతకాలం కుళ్లనిచ్చేవారు. తర్వాత దాన్ని కొవ్వు లేదా జంతువుల కొవ్వుతో కలిపి వేడి చేసి జుట్టుకు రాసుకునేవారని కొన్ని పురాతన వైద్య, సౌందర్య పద్ధతుల వివరాలు సూచిస్తున్నాయి. ఇది ఆధునిక అర్థంలో హెయిర్‌ డై కాకపోయినా.. జుట్టు రంగును ముదురు చేయడం లేదా జుట్టు రూపాన్ని మెరుగుపరచడం కోసం ఉపయోగించే సౌందర్య చికిత్సగా భావించవచ్చు. అంతేకాదు.. జుట్టు మెరుపు, రంగు, బలం, మృదుత్వాన్ని పెంచేందుకు వివిధ జంతువుల శరీర భాగాలతో తయారు చేసిన మిశ్రమాలను కూడా ఉపయోగించేవారని ఆధారాలు ఉన్నాయి. అంటే అందంగా కనిపించేందుకు పురాతన ఈజిప్షియన్లు ఎంతటి విచిత్రమైన పద్ధతులకైనా సిద్ధపడేవారన్నమాట!

గొప్ప నాగరికతకు మరో కోణం

పురాతన ఈజిప్టు ప్రపంచానికి పిరమిడ్లు, అద్భుతమైన నిర్మాణాలు, కళలు, వైద్యం, గణితం, ఖగోళ పరిజ్ఞానం వంటి ఎన్నో గొప్ప విషయాలను అందించింది. అదే సమయంలో వారి మత విశ్వాసాలు, మరణం తర్వాతి జీవితంపై నమ్మకాలు, వైద్య పద్ధతులు, అందం కోసం చేసిన ప్రయత్నాల్లో మనకు నేడు చాలా వింతగా అనిపించే అంశాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ ఆచారాలను నేటి ప్రమాణాలతో మాత్రమే చూసి జడ్జ్ చేయడం కంటే, అవి ఏ కాలంలో, ఎలాంటి సామాజిక పరిస్థితుల్లో, ఎలాంటి నమ్మకాల మధ్య ఏర్పడ్డాయో అర్థం చేసుకోవడం ముఖ్యం. వేల ఏళ్ల క్రితం మనుషులు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకున్నారో తెలుసుకోవడానికి ఇలాంటి ఆధారాలు ఎంతో విలువైనవి. పిరమిడ్ల వెనుక దాగి ఉన్న ఈజిప్టు నాగరికత ఎంత అద్భుతమైనదో.. దాని ఆచారాల వెనుక దాగి ఉన్న కథలు కూడా అంతే ఆసక్తికరమైనవి.