ముర్రెపాలు బిడ్డకు సహజమైన తొలి టీకా

Sridevi

విజయవాడ: ప్రసవం అనంతరం మొదటి గంటలోనే తల్లిపాలను బిడ్డకు అందించడం ఎంతో ముఖ్యమని, పుట్టిన వెంటనే వచ్చే పసుపు రంగు ముర్రెపాలు శిశువుకు సహజమైన తొలి టీకా వంటివని చిన్నపిల్లల వైద్య నిపుణురాలు పి. శ్రీదేవి తెలిపారు. ముర్రెపాలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ప్రతిరక్షకాలు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయని పేర్కొన్నారు.

ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ బెంజ్‌సర్కిల్‌లోని వాసవ్య నర్సింగ్‌ హోంలో గురువారం డాక్టర్‌ సమరం అధ్యక్షతన ఆరోగ్య సదస్సు నిర్వహించారు.  డాక్టర్‌ శ్రీదేవి ‘తల్లిపాల ప్రాముఖ్యత’ అంశంపై ప్రసంగించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌ మార్గదర్శకాల ప్రకారం శిశువుకు తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. ఈ కాలంలో నీరు, తేనె, గ్లూకోజ్‌ నీరు, పాలపొడి లేదా ఇతర ఆహార పదార్థాలు ఇవ్వకూడదన్నారు. ఆరు నెలల తర్వాత అనుబంధ ఆహారం ప్రారంభించినప్పటికీ రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం ఉత్తమమని వివరించారు.

తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారాన్ని అందించడంతోపాటు అనేక అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయని తెలిపారు.  బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డాక్టర్‌ శ్రీదేవి తెలిపారు. ప్రసవం అనంతరం గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి చేరడానికి, రక్తస్రావం తగ్గడానికి, తల్లి వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుందన్నారు. రొమ్ము క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్‌, రెండో రకం మధుమేహం వంటి వ్యాధుల ముప్పును తగ్గించడంలోనూ తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. తల్లీబిడ్డల మధ్య భావోద్వేగ అనుబంధాన్ని మరింత బలపరుస్తాయని తెలిపారు.

సిజేరియన్‌ ప్రసవం జరిగినప్పటికీ బిడ్డకు తల్లిపాలు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. తల్లిపాలు చాలవనే అపోహతో వైద్యుల సలహా లేకుండా డబ్బా పాలు ప్రారంభించడం సరికాదన్నారు. డబ్బా పాలు ఇవ్వడం వల్ల తల్లిపాల ద్వారా లభించే సహజమైన రోగనిరోధక శక్తి శిశువుకు అందకుండా పోతుందని హెచ్చరించారు. సదస్సులో పాల్గొన్న మహిళలు అడిగిన పలు ప్రశ్నలకు డాక్టర్‌ శ్రీదేవి సమాధానమిచ్చి సందేహాలను నివృత్తి చేశారు.