రోజురోజుకూ పెరుగుతున్న సి.ఎన్.జి గ్యాస్ ధరలను ఉపసంహరించాలి

city dharna

రోజురోజుకూ పెరుగుతున్న సి.ఎన్.జి గ్యాస్ ధరలను  ఉపసంహరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం  రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ గడియార స్తంభం వద్ద ధర్నా జరిగింది.

ఈ సందర్భంగా విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కె.దుర్గారావు,సెంట్రల్ సిటీ సిఐటియు అధ్యక్షులు యం.వి సుధాకర్ మాట్లాడుతూ రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్,డీజిల్ సి.ఎన్.జి గ్యాస్ ధరలతో ఆటో మోటార్ కార్మికుల సంపాదనలో సగభాగం ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు. కార్పొరేట్లకు  ఇచ్చే రాయితీలు విరమించుకుంటే ధరలు పెంచాల్సిన అవసరం లేదన్నారు.

యుద్ధం పేరు చెప్పుకొని కార్పొరేట్లకు దోచుకునే అవకాశం కల్పించి వాహనదారులపై మోటార్ రంగంపై జీవించే ఆటో,మోటార్ కార్మికులపై పెను భారం మోపుతున్నారని చెప్పారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా జీవనోపాధి దెబ్బతిని తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇటువంటి సమయంలో ధరలు తగ్గించాల్సింది పోయి మూలిగే నక్క మీద తాటికాయ పట్టుచందంగా సి.ఎన్.జి గ్యాస్ ధరలు రోజు రోజుకి పెరగడంతో ఆటో,మెటార్ వృత్తిని మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కనుక ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ధరలను నియంత్రించాలని కోరారు.

కార్యక్రమంలో విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ సిఐటియు యూనియన్ సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి ఎం.హనుమంతరావు, రైల్వే స్టేషన్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు డి,కోటయ్య,ఎ.వి రెడ్డి, నాయకులు ఆర్, సుబ్బరాజు,ఎం.ప్రభుదాసు,డి. శ్రీనివాస్ రెడ్డి,ఎస్.కె నాగూర్,వి.రామారావు,కె. శ్రీనివాసరావు, సైఫుల్లా తదితరులు పాల్గొన్నారు.