ఆధునిక మనుషుల డిఎన్ఏలో ఇప్పటివరకు తెలియని పురాతన మానవ సమూహాల జన్యు ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ పరిశోధకులు. వీటిని ‘ఘోస్ట్ యాన్సెస్టర్స్’ (ఘోస్ట్ యాన్సిస్టర్స్ ) గా పేర్కొన్నారు. ఈ మానవ సమూహాలు ఎప్పుడో అంతరించిపోయాయి. వాటికి సంబంధించిన ప్రత్యక్ష డిఎన్ఏ ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు.
మనిషితో కలిసి జీవించిన ఇతర మానవ జాతులు
ప్రస్తుతం భూమిపై జీవించి ఉన్న ఏకైక మానవ జాతి హోమో సేపియన్స్. కానీ గతంలో నియాండర్తల్స్, డెనిసోవన్లతో పాటు మరికొన్ని మానవ జాతులు కూడా భూమిపై జీవించాయి. ఆధునిక మానవుల పూర్వీకులు నియాండర్తల్స్, డెనిసోవన్లతో సంతానం పొందినట్లు ఇప్పటికే పరిశోధనల్లో తేలింది. ఇప్పుడు తాజాగా మరో రెండు తెలియని మానవ వంశాలు కూడా మన పూర్వీకులతో కలిసినట్లు ఆధారాలు లభించాయి.
50 వేల ఏళ్ల క్రితం జరిగిన కలయిక
మొదటి ‘ఘోస్ట్’ పూర్వీకుడు ఆఫ్రికాలో ఆధునిక మానవుల పూర్వీకులతో 50 వేల ఏళ్లకు పైగా క్రితం కలిసినట్లు పరిశోధకులు అంచనా వేశారు. ఈ కలయిక నుంచి వచ్చిన జన్యు భాగాలు ప్రస్తుతం జీవిస్తున్న మనుషుల డిఎన్ఏలో సుమారు 1 శాతం ఉన్నట్లు గుర్తించారు. అంటే నియాండర్తల్ డిఎన్ఏతో దాదాపు సమానమైన స్థాయిలో ఈ జన్యు ప్రభావం ఉండవచ్చు. ఈ తెలియని మానవ వంశం ఆధునిక మానవుల పరిణామ రేఖ నుంచి సుమారు 8 లక్షల ఏళ్ల క్రితమే విడిపోయి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
మరో 18 లక్షల ఏళ్ల నాటి పూర్వీకుడు
రెండో వంశాన్ని శాస్త్రవేత్తలు ‘సూపర్-ఆర్కైక్ యాన్సెస్టర్’ గా పిలుస్తున్నారు. ఈ వంశం ఇతర మానవ జాతుల నుంచి దాదాపు 18 లక్షల ఏళ్ల క్రితమే విడిపోయింది. సుమారు 2 లక్షల ఏళ్ల క్రితం యూరేషియాలో ఈ వంశం డెనిసోవన్లతో కలిసినట్లు పరిశోధకులు భావిస్తున్నారు.ఆ తర్వాత ఈ పురాతన డిఎన్ఏ డెనిసోవన్ల ద్వారా ఆధునిక మానవుల డిఎన్ఏలోకి చేరి ఉండవచ్చని అంచనా.
10 లక్షల ఏళ్ల నాటి జన్యు ఆనవాళ్లు!
ఈ పరిశోధనలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఇదే. 10 లక్షల ఏళ్లకు పైగా క్రితం జీవించిన ఒక మానవ వంశం జన్యు ప్రభావం నేటి మనుషుల డిఎన్ఏలో కనిపిస్తోంది. అయితే ఆ మానవ సమూహానికి చెందిన డిఎన్ఏను శాస్త్రవేత్తలు ఇప్పటివరకు నేరుగా సేకరించలేకపోయారు.
మన పరిణామం కుటుంబ వృక్షం కాదు!
గతంలో మానవ పరిణామాన్ని ఒక కుటుంబ వృక్షంలా భావించేవారు. కానీ కొత్త పరిశోధనలు మానవ పరిణామం సూటిగా జరగలేదని సూచిస్తున్నాయి. వేర్వేరు మానవ సమూహాలు వలసలు వెళ్లడం, ఒకరితో ఒకరు కలవడం, సంతానం పొందడం పదేపదే జరిగాయి. అందుకే మానవ పరిణామ కుటుంబ వృక్షం కంటే విడదీయలేని ఒక పజిల్ లా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నేటికీ మనలో నియాండర్తల్ డిఎన్ఏ
ఆఫ్రికా వెలుపల నివసించే ప్రజల డిఎన్ఏలో సాధారణంగా 1–2 శాతం వరకు నియాండర్తల్ డిఎన్ఏ ఉంటుంది. సుమారు 50–60 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి బయటకు వచ్చిన ఆధునిక మానవుల పూర్వీకులు నియాండర్తల్స్తో కలిసిన ఫలితంగానే ఈ జన్యు భాగాలు మనలోకి వచ్చాయి. ఈ జన్యువుల్లో కొన్ని మన రోగనిరోధక శక్తి, చర్మం, జుట్టు, పర్యావరణానికి అనుగుణంగా మారే సామర్థ్యంపై ప్రభావం చూపుతున్నాయి.
డెనిసోవన్ల డిఎన్ఏ కూడా ఉంది
ఆసియా, ఓషియానియా ప్రాంతాల్లోని కొన్ని జనాభాల్లో నియాండర్తల్ డిఎన్ఏతో పాటు డెనిసోవన్ డిఎన్ఏ కూడా కనిపిస్తుంది. నియాండర్తల్స్, డెనిసోవన్లు కూడా ఒకరితో ఒకరు కలిసినట్లు ఆధారాలు ఉన్నాయి. సైబీరియాలోని డెనిసోవా గుహలో లభించిన ఓ మానవ అవశేషంలో తల్లి నియాండర్తల్, తండ్రి డెనిసోవన్ అని జన్యు పరిశోధనలో తేలింది.
‘ఘోస్ట్’ పూర్వీకులు ఎవరు?
ఈ తెలియని మానవ సమూహాలు అసలు ఎవరు అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. 8 లక్షల ఏళ్ల క్రితం విడిపోయిన ‘ఘోస్ట్’ పూర్వీకులు ఆఫ్రికాలో జీవించిన పురాతన హోమో జాతుల్లో ఒకటి అయి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అలాగే 18 లక్షల ఏళ్ల క్రితం విడిపోయిన ‘సూపర్-ఆర్కైక్’ పూర్వీకుడు హోమో ఎరెక్టస్కు దగ్గరగా ఉన్న వంశానికి చెందినవాడు అయి ఉండవచ్చని అంచనా.
మన డిఎన్ఏలో దాగిన మానవ చరిత్ర
ఈ పరిశోధన మరో విషయాన్ని స్పష్టం చేస్తోంది. మనిషి పరిణామ చరిత్ర మనం ఊహించినదానికంటే చాలా సంక్లిష్టమైనది. నియాండర్తల్స్, డెనిసోవన్లతో పాటు ఇప్పుడు తెలియని మరికొన్ని పురాతన మానవ వంశాల జన్యు ఆనవాళ్లు కూడా మన డిఎన్ఏలో ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి. అంటే మన డిఎన్ఏలోనే వేల, లక్షల ఏళ్ల మానవ చరిత్ర దాగి ఉండవచ్చు.
