ఆయన ఆస్తుల విలువ ఎంతంటే …
కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్‌షూటర్, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత డీకే శివకుమార్ త్వరలో సీఎం పదవిని చేపడితే, దేశంలోనే అత్యంత రిచ్చెస్ట్ సీఎంగా రికార్డు సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో వెల్లడించిన ఆస్తుల వివరాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఆయన బ్యాక్ గ్రౌండ్ కి సంబందించిన కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలేంటో తెలుసా…
మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన డీకే శివకుమార్, ఒక చిన్న పట్టణ వ్యాపారి స్థాయి నుంచి కర్ణాటకలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా ఎదిగిన తీరు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వకముందు
1980లలో వీహెచ్ఎస్ (VHS) కాలంలో ఆయన బెంగళూరు దక్షిణ ప్రాంతంలో ఒక వీడియో పార్లర్‌ను రన్ చేసేవారు . ఆ రోజుల్లోనే లోకల్ వాళ్లంతా కలిసేలా ఆయన షాప్ నడిచేది. అలా చాలా చిన్న వయసులోనే ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడం మొదలుపెట్టారు . అలా క్షేత్ర స్థాయిలో ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ పరిచయాలే ఆయన పొలిటికల్ గా డెవలప్ కావడానికి దోహదపడ్డాయని చెప్తారు.
2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, డీకే శివకుమార్ తన ఆస్తుల విలువను గమనిస్తే రూ.1,413 కోట్లుగా ప్రకటించారు. 2008లో రూ.75.5 కోట్లుగా ఉన్న ఆస్తులు, 2013 నాటికి రూ.251 కోట్లకు, 2018లో రూ.840 కోట్లకు, 2023లో రూ.1,413 కోట్లకు చేరుకున్నాయి. ఆయన ఆస్తుల్లో ఎక్కువ శాతం భూములు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ఇతర వ్యాపార ఆస్తుల రూపంలో ఉన్నాయి. అఫిడవిట్ ప్రకారం బెంగళూరు, మైసూరు, కనకపుర, అలాగే దేశ రాజధాని ఢిల్లీలో విలాసవంతమైన నివాస గృహాలు, ఇతర విలువైన స్థిరాస్తులు ఆయన పేరిట ఉన్నాయి.
గ్రానైట్, క్వారీ రంగాల్లో డీకే శివకుమార్‌కు ఉన్న వ్యాపార అనుబంధాల కారణంగా ఆయనకు “కనకపుర బండ” అనే బిరుదు వచ్చింది. ఈ పేరు కేవలం ఆయన వ్యాపార నేపథ్యాన్నే కాకుండా, కనకపుర ప్రాంత రాజకీయాలపై ఆయనకున్న బలమైన పట్టును ప్రతిబింబిస్తుంది.అయితే ఆయన రాజకీయ ప్రయాణం వివాదాలకు అతీతం కాదు. 2017లో ఆదాయపు పన్ను శాఖ ఆయనకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించింది. 2019లో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ అరెస్టు చేసింది. అయినప్పటికీ, ఎదురుదెబ్బలను తట్టుకుని డీకే శివకుమార్ కర్ణాటక రాజకీయాల్లో కీలక శక్తిగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి సంక్షోభ సమయంలో ట్రబుల్‌షూటర్‌గా వ్యవహరిస్తూ, తన రాజకీయ ప్రభావాన్ని విస్తరించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్ర, భవిష్యత్తు రాజకీయ అడుగులు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.
