ఉప్పల్ బాలు–నవదీప్ మధ్య సీన్ రివర్స్.. 

Uppal balu

శాపనార్ధాల వీడియోల నుంచి ఎంకరేజ్మెంట్ వరకు!

కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు.. నవదీప్‌ను ఉద్దేశించి చేసిన శాపనార్ధాల వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే ఇప్పుడు బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు పాల్గొన్న ఎపిసోడ్ చూస్తే మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. గతంలో విమర్శలు ఎదుర్కొన్న నవదీప్.. ఈ ఎపిసోడ్‌లో బాలుతో నేరుగా మాట్లాడటమే కాకుండా, చివర్లో అతడికి గుడ్ లక్ చెప్పి ఎంకరేజ్ చేశాడు. బాలు తన పరిచయం ఇచ్చుకున్న తర్వాత నవదీప్ అతడు గతంలో చేసిన వీడియోల గురించి ప్రశ్నించాడు. ‘ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తుంటారు కదా.. అవన్నీ వెకిలి వీడియోస్ కదా?’ అని అడిగాడు. అందుకు బాలు.. మొదట్లో కొంత వల్గర్‌గా వీడియోలు చేశానని, చాలామంది మార్చుకోవాలని చెప్పడంతో తాను కూడా మారానని తెలిపాడు. ‘ఇలాగే ఎందుకు ఉండాలి.. కొంచెం మారాలి అనుకున్నాను. ఇప్పుడు అలాంటి వీడియోలు చేయడం లేదు” అని బాలు చెప్పాడు.

అనంతరం శ్రీముఖి అసలు ప్రశ్నను ముందుకు తెచ్చింది. ‘బాలు.. మీరు బిగ్‌బాస్‌కి డబ్బుల కోసం వెళ్తున్నారా? ఫేమ్ కోసమా? ఎక్స్‌పీరియన్స్ కోసమా?’ అని అడిగింది. దీనికి బాలు.. తన అభిమానులు చాలామంది బిగ్‌బాస్‌కు వెళ్లాలని మెసేజ్‌లు చేస్తున్నారని చెప్పాడు.

అయితే నవదీప్ మాత్రం అతడి ఫ్యాన్ ఫాలోయింగ్‌పై ప్రశ్నలు సంధించాడు. ‘నిజంగా నమ్ముతున్నారా మీకు వాళ్లంతా ఫ్యాన్స్ ఉన్నారని? మీ నుంచి చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారని నా ఫీలింగ్. జనరల్‌గా బయట కూడా అదే ఫీలింగ్’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు. మరోవైపు బిందు మాధవి.. బాలు ట్రాన్స్ కదా? అని ప్రశ్నించగా, బాలు కాదని సమాధానం ఇచ్చాడు. గతంలో వీడియోల్లో అలా యాక్ట్ చేశావు కదా అని నవదీప్ ప్రశ్నించగా.. డబ్బు కోసం అలా నటించానని బాలు చెప్పాడు. దీనిపై నవదీప్ మరోసారి సూటిగా స్పందించాడు. ‘మీరే చెప్తున్నారుగా.. డబ్బుల కోసం వల్గర్‌గా, వెకిలిగా వీడియోలు చేశానని’ అన్నాడు. బాలు మాత్రం తన పరిస్థితిని వివరించాడు. ‘అవును సర్.. నా ఫ్యామిలీ కోసం, నా కోసం, ఫుడ్ కోసం చేశాను సర్. తప్పేముంది?’ అని ప్రశ్నించాడు.

ఇక్కడ నవదీప్ బాలును పూర్తిగా తప్పుపట్టకుండా అతడి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. ‘తప్పేం లేదు. మీ పరిస్థితుల్లో ఎవరూ వచ్చి మీకు రూపాయి ఇవ్వలేదు. ఏది వర్కౌట్ అయ్యిందో అది చేశారు. జనాలు చూశారు. వాళ్ల ఎంటర్టైన్మెంట్ కోసం మీకు డబ్బులు ఇచ్చారు. ఇదంతా ఓకే’ అని చెప్పాడు. అయితే అసలు ప్రశ్న అక్కడే ఉందంటూ నవదీప్ మరో అంశాన్ని లేవనెత్తాడు. ‘ఇప్పుడు అగ్నిపరీక్షలో మిమ్మల్ని లోపలికి పంపి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి?’ అని అడిగాడు.

దీనికి బాలు తనకు కొంత సమయం ఇస్తే మారగలనని చెప్పాడు. ‘ఇంకా అక్కడి వరకు వెళ్లలేదు కదా. రెండు రోజులు టైం ఇస్తే నేను కొంచెం మారతాను. అప్పుడు జనాలు ‘ఉప్పల్ బాలు అంటే ఇలా కూడా ఉన్నాడా?’ అనుకుంటారు’ అని చెప్పాడు. అంటే తనపై ఏర్పడిన ఇమేజ్‌ను మార్చుకోవడమే బిగ్‌బాస్‌లోకి వెళ్లాలన్న తన ప్రధాన కోరిక అని బాలు స్పష్టం చేశాడు. దీనిపై నవదీప్ కూడా అదే విషయాన్ని నిర్ధారించాడు. ‘మీ ఇమేజ్ కరెక్షన్ కోసం మీరు ఎలాంటి వారో ప్రజలు తెలుసుకోవాలి. అది మీకు మంచిది కాబట్టి మేము మిమ్మల్ని లోపలికి పంపాలని మీ ఉద్దేశం అంతేనా?’ అని అడిగాడు. ‘అదే నా కోరిక’ అని బాలు సమాధానం ఇచ్చాడు.

అయితే ఇక్కడే బాలుకు షాక్ తగిలింది. ‘ఇన్ని వేల మందిలో 15 మందిని మాత్రమే పంపాలన్న బాధ్యత మాకు ఉంది. మేము మిగతా వాళ్లను చూశాం కాబట్టి నీకంటే వాళ్లకే ఓటు వేస్తాను’ అంటూ నవదీప్ రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు. బిందు మాధవి, అభిజిత్ కూడా బాలుకు రెడ్ ఫ్లాగ్ ఇవ్వడంతో అతడికి బిగ్‌బాస్ అగ్నిపరీక్ష గేట్లు మూసుకుపోయాయి.

‘బాధేస్తుందా?’ అని శ్రీముఖి అడిగితే.. బాలు మాత్రం వెనక్కి తగ్గలేదు. ‘నాకు అవకాశం రాలేదు. కానీ బిగ్‌బాస్‌కు వెళ్లడం నా గోల్. మళ్లీ మళ్లీ ట్రై చేస్తూనే ఉంటాను. మెయింటైన్ చేస్తాను. 6 ప్యాక్ కూడా ట్రై చేస్తాను’ అంటూ తన పట్టుదలను వెల్లడించాడు. చివర్లో నవదీప్ కూడా బాలును ప్రోత్సహిస్తూ.. ‘జిమ్‌కి వెళ్లి 6 ప్యాక్ పెంచు. అప్పుడు మొత్తం జనాలు షాకై షేక్ అవుతారు. అలాంటిది ఏదైనా చెయ్యి బాలు. గుడ్ లక్’ అంటూ ఎంకరేజ్ చేశాడు.

ఇలా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నట్లుగా కనిపించిన ఉప్పల్ బాలు, నవదీప్.. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష వేదికపై మాత్రం ఎదురెదురుగా కూర్చొని మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నవదీప్ బాలును ప్రశ్నించిన తీరు, చివర్లో అతడికి ఇచ్చిన సలహా ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.