బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో రన్నింగ్ రాజా రచ్చ.. శ్రీముఖి ఫైర్!

Srimukhi

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్‌ 2లో మొదటి కంటెస్టెంట్‌గానే కర్నూలుకు చెందిన ‘రన్నింగ్ రాజా’ ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో షో చాలా కూల్‌గా, ఫన్‌గా సాగుతుండగా రన్నింగ్ రాజా ఎంట్రీతో ఒక్కసారిగా స్టేజ్ హీటెక్కింది. ముఖ్యంగా యాంకర్ శ్రీముఖిని టార్గెట్ చేస్తూ అతడు చేసిన కామెంట్స్‌ తీవ్ర చర్చకు దారితీశాయి. శ్రీముఖి తనదైన స్టైల్‌లో జోష్‌గా షోను నడిపిస్తూ జ్యూరీలను పరిచయం చేస్తుండగా రన్నింగ్ రాజా ఆమెను ఉద్దేశించి సెటైర్లు వేశాడు. ‘ఒక్కణ్ణే ఇంతలా అరుస్తుంటే’ అంటూ కామెంట్ చేయడంతో శ్రీముఖి ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ‘నువ్వు పోతావా? నన్ను పొమ్మంటావా?’ అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే రన్నింగ్ రాజా మాత్రం పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ‘మీరుండాలి.. నేనుండాలి.. ఈ షో హిట్ అవ్వాలి’ అంటూ చెప్పాడు. కానీ అప్పటికే మాటల యుద్ధం మరింత ముదిరింది.

నవదీప్ కూడా రన్నింగ్ రాజాను ప్రశ్నిస్తూ.. కేవలం మిమిక్రీ, రీల్స్ చేస్తే బిగ్‌బాస్‌కు పంపిస్తారని అనుకుని వచ్చావా? అని అడిగాడు. అందుకు రన్నింగ్ రాజా తనకు ఏ పని ఇచ్చినా చేయగలనని, పొలంలో పని చేసినా చేస్తానని, ఎవరితో ఎలా మెలగాలో తనకు తెలుసని చెప్పాడు.

అక్కడితో ఆగకుండా బిందు మాధవి కూడా అతడిపై స్పందించింది. ‘శ్రీముఖి నీ మీద కోపంగా ఉంది. ఎలా మెలగాలో తెలుసన్నావ్.. ఎలా మెదులుతావో మెదులు’ అంటూ వ్యాఖ్యానించింది. రన్నింగ్ రాజా ఆమె దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా బిందు మాధవి తీవ్రంగా స్పందించింది. ‘దూరం నుంచి మాట్లాడు. టచ్ చేస్తే చెంప మీద కొడతా. దూరంగా వెళ్లు’ అంటూ హెచ్చరించింది. దీంతో రన్నింగ్ రాజా వెంటనే ‘ప్లీజ్ అక్కా.. సారీ సారీ’ అంటూ వెనక్కి తగ్గాడు.

ఈ పరిణామాలతో శ్రీముఖి కూడా తీవ్ర అసహనానికి గురయ్యారు. చేతిలో ఉన్న పేపర్లను విసిరేసి సీటులో నుంచి లేచి స్టేజ్‌ నుంచి వెళ్లిపోయారు. దీంతో షో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అనంతరం నవదీప్ రన్నింగ్ రాజాకు క్లాస్ తీసుకున్నాడు. ‘మీరు ఏ షోకి వచ్చారు? ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలుసుకుని తర్వాతి షోకి వెళ్లండి’ అంటూ సూచించాడు. ఈ సమయంలో రన్నింగ్ రాజా స్టేజ్‌పైనే కుప్పకూలి ఏడ్చాడు.

వెళ్లిపోతూ ‘అమ్మా.. నేను సాన మందికి సమాధానం చెప్పాలా?’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. దానికి నవదీప్ ‘వెళ్లి చెప్పు మరి.. ఎవరొద్దన్నారు?’ అంటూ బదులిచ్చాడు. తన చెల్లెలు తనతో ఎప్పుడూ ఒక్కటే మాట చెబుతుందని, ‘ఎప్పుడైనా తలెత్తుకునేలా చెయ్యి’ అని అంటుందని రన్నింగ్ రాజా భావోద్వేగానికి గురయ్యాడు. దీనిపై నవదీప్ స్పందిస్తూ.. ‘బానే చేస్తున్నావ్ కదా.. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అవన్నీ చేసుకుంటూ ఉండు’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.

‘బిగ్‌బాస్ చాలా పెద్ద షో సర్’ అని రన్నింగ్ రాజా చెప్పగా, ‘అవును.. అక్కడి వరకు వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు’ అంటూ నవదీప్ సూచించాడు. చివరికి రన్నింగ్ రాజా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మొదటి కంటెస్టెంట్ ఎంట్రీతోనే అగ్నిపరీక్ష స్టేజ్‌పై ఇంతటి డ్రామా చోటుచేసుకోవడం ఇప్పుడు షోపై ఆసక్తిని మరింత పెంచింది. శ్రీముఖి-రన్నింగ్ రాజా మధ్య జరిగిన ఈ ఎపిసోడ్ సోషల్ మీడియాలో ఎలాంటి చర్చకు దారితీస్తుందో చూడాలి.